ప్రముఖ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడూ రకరకాల పోస్ట్‌లు పెడుతూ నెటిజన్ల నుండి వచ్చే కామెంట్స్‌ని కూడా స్వీకరిస్తారు. కొందరు అడిగే సందేహలకు సమాధానం కూడా ఇస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ‘మీ క్వాలిఫికేషన్ తెలుసుకోవచ్చా’ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఏం జరిగిందంటే.. హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తోన్న ఓ వ్యక్తి.. అక్కడి పర్వత ప్రాంతంలో ఓ చిన్నారి ఒంటరిగా కూర్చుని చదువుకుంటున్న ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసి.. ఆమె తపనను కొనియాడారు.
అనంతరం.. ఆనంద్ మహీంద్రాకూ ఆ పోస్టును ట్యాగ్ చేశారు. మహీంద్రా సైతం ఆమె పట్టుదలకు ముగ్ధుడై.. ‘అందమైన చిత్రం ఇది. ఈ బాలిక నాకు ప్రేరణ’ అని రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘సర్. మీ క్వాలిఫికేషన్ తెలుసుకోవచ్చా’ అంటూ మహీంద్రాను ఉద్దేశించి ఆ పోస్టుపై కామెంట్ పెట్టారు. దానికి ఆయన బదులిస్తూ.. ‘స్పష్టంగా చెప్పాలంటే, నా వయస్సులో.. ఏ యోగ్యతకైనా కేవలం అనుభవమే అర్హత’ అని తెలిపారు. ఈ రిప్లై కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ప్రశ్న అడిగిన వ్యక్తిపై మండిపడిన నెటిజన్లు.. మరోవైపు ఆనంద్ మహీంద్రా సమాధానంపై ప్రశంసలు కురిపించారు.
Frankly, at my age, the only qualification of any merit is experience… https://t.co/azCKBgEacF
— anand mahindra (@anandmahindra) June 27, 2022