తల్లిపై కొడుకు ప్రేమకు మహీంద్ర ఫిదా.. 7 లక్షల కారు గిఫ్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

తల్లిపై కొడుకు ప్రేమకు మహీంద్ర ఫిదా.. 7 లక్షల కారు గిఫ్ట్

September 21, 2020

Anand Mahindra Keeps His Promise; Delivers Vehicle

తల్లి మీద కొడుకు ప్రేమను చూసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు.  స్కూటర్ మీద కాకుండా కారులో దేశం మొత్తం తిప్పడానికి ఆయన రూ.7 లక్షల కారును గిఫ్టుగా ఇస్తానని గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఆయన మాట నిలబెట్టుకున్నారు. శుక్రవారం మహీంద్రా కేయూవీ 100 నెక్ట్స్‌ను వారికి అందజేశారు. ఈ బహుమతిని చూసి కృష్ణ కుమార్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ‘ఇది మా అమ్మకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆమె ఇప్పటికీ నమ్మలేకపోతోంది. మా అమ్మను ఈ కారులో చాముండేశ్వరి ఆలయానికి తీసుకెళ్లాను. కారులోని టచ్‌ స్క్రీన్‌, ఇతర విషయాల గురించి ఎన్నో ప్రశ్నలు అడిగింది. మా అమ్మ చిన్నపిల్లలా మారిపోయింది. స్కూటర్ నుంచి కారు.. మా అమ్మ ఈ ప్రయాణం ఎన్నో అనుభూతులను మూట కట్టుకోనుంది’ అంటూ కుమార్ సంతోషం వ్యక్తంచేశాడు. కాకపోతే ఇప్పటి పరిస్థితులు ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో ప్రస్తుతానికి ఇంట్లోనే ఉండనున్నట్లు తెలిపాడు. 

ఇంటిరే పరిమితం అయిన తల్లిని దేశం మొత్తం తిప్పాలని.. 

కర్ణాటకలోని మైసూరుకు చెందిన చూడారత్న అనే వృద్ధురాలికి దేశంలోని అన్ని తీర్థయాత్రలు తిరగాలని కోరిక. కానీ, ఆమెకు భర్త లేడు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్న కొడుకు డి.కృష్ణకుమార్(39) మాత్రమే ఉన్నాడు. అతడి దగ్గర తనను తీర్థయాత్రలకు తీసుకెళ్లేంత డబ్బు లేదు. దీంతో తన కోరికను ఎవ్వరికీ చెప్పలేక పోయింది. కానీ, చివరకు తన కొడుకుతో హంపి చూడాలని ఉందని చెప్పింది. దీంతో తల్లి కోరికను నెరవేర్చాలని కృష్ణ కుమార్ నిర్ణయించుకున్నాడు. తన వద్ద ఉన్న పాత స్కూటర్‌పై గతేడాది ఆమెను తీర్థయాత్రలకు తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. ‘మాతృ సేవా సంకల్ప యాత్ర’ పేరుతో యాత్రను ప్రారంభించాడు. అప్పటికే తల్లీ, కొడుకులు తీర్థయాత్రల కోసం జనవరి నాటికి 56,552 కిలో మీటర్లు తిరిగారు. ఈ మాతృప్రేమ గత సంవత్సరం అక్టోబర్‌లో ఆనంద్ మహీంద్రా దృష్టిలో పడింది. కుమారుడు తల్లి పట్ల చూపిస్తోన్న అభిమానానికి పొంగిపోయారు. స్కూటర్ మీద అంత దూరం ప్రయాణం మంచిది కాదని భావించి.. వారికి ఒక కారు బహుమతిగా ఇస్తానని అప్పుడే ప్రకటించారు. 

ఆయన వీరికి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. ‘ఇది ఒక అందమైన కథ. తల్లిపై, దేశంపై ఓ వ్యక్తికి ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. ఆయనకు నేను మహీంద్రా కేయూవీ 100 నెక్ట్స్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇకనుంచి తన తల్లిని కారులో తిప్పుతారు’ అని ట్వీట్ చేసి నెటిజన్ల ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం కారును బహుమతిగా ఇచ్చి, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాగా, కారు వచ్చినప్పటికీ, తమకు ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చిన స్కూటర్‌ను మాత్రం తనతోనే ఉంచుకుంటానని కృష్ణ తెలిపాడు. ఈ కారును సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వెల్లడించాడు. ఇన్ని ప్రాంతాలు పర్యటించినప్పటికీ ఆ తల్లీకుమారులు ఒక్కసారి కూడా హోటల్‌లో బస చేయలేదట. దేవాలయాలు, మఠాల్లోనే బసచేశారు.