కరోనా తర్వాత ఇంతలా ఎంజాయ్ చేద్దాం.. ఆనంద్ మహీంద్రా - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా తర్వాత ఇంతలా ఎంజాయ్ చేద్దాం.. ఆనంద్ మహీంద్రా

July 6, 2020

Anand Mahindra.

వేల కోట్ల వ్యాపార లావాదేవీలతో బిజీగా ఉండే బిగ్ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడూ ట్విటర్ వేదికగా చూడ చక్కని, సందేశాత్మక, సరదా వీడియోలు పంచుకుంటుంటారు. తనకు దొరికే కొద్దిపాటి విరామ సమయాల్లో సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ఓ కన్నేసి ఉంచుతారు. ఆయన ట్వీట్ చేశారంటే అందులో ఏదో ఒక విషయం, విశేషం తప్పకుండా ఉంటుంది. ఈసారి ఆయన షేర్ చేసిన వీడియో ఎందరికో తమ గ్రామీణ బాల్యాన్ని గుర్తుచేస్తుంది. 

కొందరు చిన్నపిల్లలు మట్టిలో జారుతూ వెళ్లి చెరువులో డైఫ్ కొడుతున్నారు. ఇలాంటివి మనకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద ప్లాస్టిక్ ఆకారంలో కనిపిస్తాయి. కానీ, ఇది పూర్తిగా బురద మట్టిలో ఉంది. పిల్లలు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ మట్టిమీద జారుతున్నారు. వేగంగా జారుతూ వెళ్లి చెరువులో పడుతున్నారు. ‘ఈ వీడియో నాకు సోమవారం మళ్లీ పని ప్రారంభించడానికి అవసరమైన ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ వీడియోలో ఎంతో సందేశం ఉంది. కరోనా తర్వాత ప్రపంచం యావత్తు నిరాడంబర జీవితం గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తుంది’ అని ఆయన స్టేటస్ పెట్టారు. దీంతో ఈ వీడియోను ఎంతో మంది షేర్ చేస్తున్నారు. చలామందికి తమ బాల్యం గుర్తకు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను నాంది ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ ట్వీట్ చేయగా, ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేసి తన ఫాలోవర్లకు మంచి అనుభూతిని మిగిల్చారు.