Anand Mahindra Tweets Winston Churchill’s 1947 Quote As Rishi Sunak Becomes UK PM
mictv telugu

‘ఇండియన్స్‌కు చేతకాదన్న మాజీ ప్రధానికి.. ఇదే సమాధానం’

October 25, 2022

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై చరిత్ర సృష్టించారు. యూకేలో అనూహ్య పరిణామాల మధ్య ఆయన తిరుగులేని నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికపై ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. పలు ఆరోపణలతో బోరిస్ జాన్సన్ గద్దె దిగిన తర్వాత ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన లిజ్ ట్రస్.. ఆర్థిక సంక్షోభం కారణంగా 45 రోజులకే ప్రధాని పీఠం నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో ప్రధాని పదవి రేసులోకి మళ్లీ బోరిస్ జాన్సన్, రిషి సునాక్ వచ్చారు. అయితే, ఆ తర్వాత బోరిస్ తప్పుకోవడంతో రిషి ఎన్నిక లాంఛనమే అయింది. భారత్‌ను పాలించిన బ్రిటన్‌కు ఇప్పుడు భారతీయ మూలాలున్న రిషి సునాక్ ఎన్నిక కావడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు స్పందిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘1947లో మన దేశ స్వాతంత్ర్యం వేళ భారత్‌కు చెందిన నాయకుల్ని చిన్నచూపు చూస్తూ యూకే మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయంటూ అవహేళన చేశారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్‌ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన జవాబు ఇచ్చారు. జీవితం ఎంతో అందమైంది’అంటూ ట్వీట్‌ చేశారు.