దెయ్యాలకు భయపడని ‘ఆనందో బ్రహ్మ’లు! - MicTv.in - Telugu News
mictv telugu

దెయ్యాలకు భయపడని ‘ఆనందో బ్రహ్మ’లు!

August 18, 2017

చిత్రం :  ఆనందో బ్రహ్మ

ఉప శీర్షిక : భయానికి నవ్వంటే భయం

నిడివి :  123 నిముషాల 58 సెకన్లు

బేనర్ : 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్

సినిమాటోగ్రఫి : అనిష్ తరుణ్ కుమార్

ఎడిటింగ్ : శ్రవణ్

సంగీతం : కె

నిర్మాతలు :  విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి

రచన – దర్శకత్వం : మహి వి రాఘవ్

నటులు : శ్రీనివాసరెడ్డి, తాప్సీ, వెన్నెల కిషోర్, శకలక శంకర్, తాగుబోతు రమేష్, రాజీవ్ కనకాల, విజయ్ చందర్, రాజా రవీంద్ర, రఘు కారుమంచి, అదుర్స్ రఘు, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి తదితరులు

హర్రర్ సినిమాలు కొంతమంది చూస్తారు. హర్రర్ కు కామెడీ జోడిస్తే అందరూ చూస్తారు. ఈ కథ అనేక సార్లు నిజమయింది. ఊపిరి తీయలేనంత ఉత్కంట లేకపోయినా కాస్తంత నవ్వుకుంటే చాలు ఈ జోనర్ సినిమాలను పాస్ చేస్తారు ప్రేక్షకులు. అలా చూసినప్పుడు లాజిక్ వదిలేసినప్పుడు ఈ సినిమాకు మంచి మార్కులే పడతాయనే చెప్పాలి.

సాధారణంగా అన్ని దెయ్యాల సినిమాల్లో దెయ్యాల్ని చూసి మనుషులు భయపడతారు. ఈ సినిమాలో దెయ్యాలు యెన్ని పాత చేష్టలు చేసినా భయపడరు. దెయ్యాలు కూడా ఆసక్తిగా ముక్కున వేలేసుకున్నట్టు చూస్తాయి. దెయ్యాల అవసరం దెయ్యాలది. మనుషుల అవసరం మనుషులది. ఎవరి ఆపద వాళ్ళది. ఈ ఆపదకీ అవసరానికీ మధ్య జరిగిన ఘర్షణలోంచి హాస్యం పుట్టింది.

కథ కొస్తే- అలవాటుగా విదేశాల్లో మొదలైన కథ ఇండియాకు వస్తుంది. మలేషియా నుంచి రాము(రాజీవ్ కనకాల) ఇక్కడికి వచ్చి అమ్మానాన్నా కోసం ఆరా తీసి వాళ్ళు చనిపోయారని భావించి ఇంటిని అమ్మాలనుకుంటాడు. అయితే ఆ యింట్లో దెయ్యాలున్నాయ్నని అన్ని సినిమాల్లోలాగే యెవరూ కొనడానికి సాహసించరు. తక్కువకు కొట్టేయాలని పోలీసు అధికారి చూస్తున్న తరుణంలో హోటల్లో బేరర్ గా పనిచేస్తున్న సిద్దు(శ్రీనివాసరెడ్డి) ఆయింట్లో వుండి దెయ్యాలు లేవని నిరూపిస్తానని దానివల్ల మీకు రావలసిన ధర వస్తుందని తనకి కొద్దిగ డబ్బు యిస్తే చాలని రాముకు చెపుతాడు. ఆ అవకాశం తీసుకున్నా ఆపదలో పడి హాస్పిటలైజ్ అవుతాడు. సిద్దు హార్ట్ పెసేంట్. ప్రాణం మీదికి తెచ్చుకోవద్దని డాక్టర్ హెచ్చరిస్తాడు. అప్పటికే తాగిన మైకంలో డబ్బును కోల్పోయిన తులసి(తాగుబోతు రమేష్) తోడు వినికిడి, రేచీకటి సమస్యతో వుద్యోగం కోల్పోయి వున్న ఫ్లూట్ రాజు(వెన్నెల కిషోర్), ‘మనీ’ సినిమాలోని మాణిక్యాన్ని నమ్మి వున్న బార్బర్ షాప్ అమ్మి సినిమా నటుడు కావాలనుకొని చెడి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న నలుగురి అవసరాలూ డబ్బే, ఆడబ్బు కసం ‘బిగ్ బాస్’ షో హౌస్ లో వున్నట్టు యిక్కడ ఈ హౌస్ లో వుండాల్సి వస్తుంది. మరి దెయ్యాలు యేమి చేసాయి? వీళ్ళేమి చేసారు అన్నది తెరమీద చూడాల్సిన కథ!

సినిమాలో మనుషులుగా వున్నవాళ్ళు వాళ్ళే దెయ్యాలని చూపించిన ప్రారంభ కథనం కొత్తగా గమ్మత్తుగా కుదిరింది. బావుంది. చూసే వాళ్ళని ఆసక్తిలోకి నెడుతుంది. అలానే సెకండాఫ్ ఫస్టాఫ్ ని మించి కామిడి పండింది. అయితే ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా కృతకంగా వున్నాయి. కృతకం వేరు హాస్యం వేరు. అది మిస్సవడం- ఆ యింట్లో వుండడానికి మిగతా వాళ్ళని హీరో సమాయత్తం చేయడంలోనూ కనిపించింది. విజయచందర్ కుటుంబ సంబంధాలు ప్లాస్టిక్ గా వున్నాయి. మరింత శ్రద్ధ పెడితే బావుండేది.

సినిమాలో శకలక శంకర్ తన సినిమా నటనతో బాగా ఆకట్టుకున్నాడు. వినపడని, కనపడని.. ఆడియో వీడియో కట్ అయిన వెన్నెల కిషోర్ సైలెంట్ గా వుండి బాగా నవ్వించాడు. తాగుబోతు రమేషూ తగ్గలేదు. శ్రీనివాసరెడ్డి తనదైన నటనని అందించాడు. తాప్సీ పాత్ర మరింతగా తీర్చి దిద్దాల్సింది.

కథ కన్నా కథనం బావుంది. పాటలు లేకపోయినా లేవే అని గుర్తుకు రావు. నేపథ్య సంగీతం బావుంది. ‘పోస్టుమార్టం వొక్కటే గవర్నమెంటు ఫ్రీగా చేస్తుంది’ లాంటి మాటలు అంత కామిడీ లోనూ మనల్ని చురుక్కుమని ఆలోచింపజేస్తాయి. మన బలహీనతలే మనకు వొక్కోసారి ‘బలం’గా తీర్చిదిద్దాడు దర్శకుడు. సరదాగా వెళ్ళి కాస్త టైం పాస్ చెయ్యాలనుకోనేవాళ్ళు సినిమా చూడొచ్చు!

రేటింగ్: 2.75/5

-జాసి