Anantapur Family In Self Lockdown At Their House Here Is Details
mictv telugu

మూడేళ్లుగా ఇంట్లోనే లాక్‌డౌన్.. అనంతపురంలో అలా మారిపోయారు

September 17, 2022

కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం రెండేళ్లలో రెండు సార్లు లాక్ డౌన్ విధించగా.. ఆ కుటుంబం మాత్రం ఏకంగా మూడేళ్లుగా సెల్ఫ్ లాక్‌డౌన్ లో ఉన్నారు. కారణం కరోనా మాత్రం కాదు. ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించకముందే.. వారు లాక్‌డౌన్ లో ఉండిపోయారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం వేణుగోపాల్‌నగర్‌‌లో అంబటి తిరుపాల్‌శెట్టికి అక్క విజయలక్ష్మి, చెల్లెలు కృష్ణవేణి ఉన్నారు. వీరికి వివాహం కాలేదు.. వారి తండ్రి 2016లో, తల్లి 2017లో అనారోగ్యంతో చనిపోయారు. తల్లిదండ్రుల మరణంతో ముగ్గురు మానసికంగా బాగా కుంగిపోయారు. ఈ ముగ్గురు అప్పటి నుంచి బయటి జనాలతో సంబంధాలు తెంచుకున్నారు.

తల్లిదండ్రులు దూరమయ్యారనే కుంగుబాటుతో ముగ్గురూ మూడేళ్లుగా రాత్రీపగలు ఇంటికే పరిమితమయ్యారు. ఇక మగదిక్కుగా ఉన్న తిరుపాల్.. తన అక్కాచెల్లెళ్ల బాగోగులు చూసుకునేందుకు తల్లిదండ్రులు బ్యాంకులో డిపాజిట్‌ చేసిన డబ్బుల వడ్డీని నెలకోసారి తెచ్చుకుంటారు. నెల గడిచేందుకు ఆ డబ్బులనే ఖర్చు చేస్తున్నాడు. తినే ఆహారం, తాగే నీళ్లు అన్ని బయటి నుంచే. కావాల్సినవి తెచ్చుకున్నాకు ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకుంటారు. మళ్లీ తర్వాతి రోజు అవసరమొస్తేనే బయటకు. కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో రెండేళ్ల కిందట కరెంట్ ఆపేశారు అధికారులు. దీంతో అప్పటినుంచి రాత్రిళ్లు చీకట్లోనే గడుపుతున్నారు. వారి వ్యవహారం తెలుసుకున్న కాలనీవాసులు శుక్రవారం వారి ఇంటి వద్దకెళ్లి బలవంతంగా తలుపులు తెరిపించారు. అప్పుడు వాళ్ల అవతారాలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మూడేళ్లుగా బయటకు రాకపోవడంతో ఆ మహిళలిద్దరి జుత్తు జడలు కట్టాయి. మాసిన దుస్తులు, మురికిదేహాలతో అత్యంత వికారంగా కనిపించారు. గట్టిగా నిలదీయగా తమ అమ్మానాన్న చనిపోయాక కుంగుబాటుకు లోనయ్యామని, జనజీవనంలోకి రావడానికి ప్రయత్నిస్తామని బాధితుడు తిరుపాల్‌శెట్టి తెలిపారు. కరెంట్ బిల్లు కట్టి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించుకుంటామని అన్నారు.