కరోనా సంక్షోభంలో పోలీసులు, వైద్యులు, పారిశుద్య కార్మికులకు సమానంగా మీడియా జర్నలిస్టులు కూడా తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఈ క్రమంలో వారు కూడా కరోనా బారిన పడుతుండటం చూస్తున్నాం. తాజాగా కరోనాపై ప్రశ్నించిన ఓ జర్నలిస్టును అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో అరెస్ట్ చేశారు. జుబేర్ అహ్మద్ అనే జర్నలిస్టు కరోనా పేషెంట్‌తో ఫోనులో మాట్లాడిన ఓ కుటుంబాన్ని క్వారంటైన్‌కు ఎలా తరలిస్తారంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. అండమాన్‌లోని హడ్డో పట్టణంలో ఓ కుటుంబం కరోనా పేషెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడినందుకు సదరు కుటుంబాన్ని క్వారంటైన్‌కు తరలించారని.. ఓ పత్రిక ఏప్రిల్ 26న కథనం ప్రచురించింది. ఆ కథనం ఆధారంగా జుబేర్ ఏప్రిల్ 27న ట్విటర్‌లో పోస్టు చేశాడు. అదే రోజు సాయంత్రం జుబేర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ వెంటనే జుబేర్ మరో ట్వీట్ కూడా చేశాడు. ‘కరోనా పేషెంట్లతో కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ఫోన్‌లో మాట్లాడొద్దు. మాట్లాడితే వారందరినీ క్వారంటైన్‌కు తరలిస్తారు. ఫోన్ కాల్స్ ఆధారంగా వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు’ అని ట్వీట్ చేశాడు. ఈ విషయమై సదరు పత్రిక ఎడిటర్ స్పందిస్తూ.. ‘ఏప్రిల్ 27న బాంబూ ఫ్లాట్ పోలీస్ స్టేషన్ నుంచి నలుగురు పోలీసులు వచ్చి జుబేర్‌కు నోటీసులు ఇచ్చారు. అబర్దీన్ పోలీసు స్టేషన్‌కు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. పోలీసులు తనను అరెస్టు చేసినట్లు జుబేర్ ఫోన్ చేసి చెప్పారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద జుబేర్‌పై కేసు నమోదు చేశారు. కేవలం ట్విటర్ వేదికగా ప్రశ్నించినందకు అరెస్టు చేస్తారా. చట్టంలో ఉన్నది ఒకటైతే అండమాన్‌లో అమలవుతున్నది మరొకటి. అండమాన్‌లో మాకు కరోనాపై సమాచారం కేవలం ట్విటర్ నుంచే వస్తుంది. లేదంటే చీఫ్ సెక్రటరీ చేతన్ సంఘీ నుంచి వస్తుంది. అక్కడ ఎలాంటి మీడియా సమావేశాలు ఉండవు గనక సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది?’ అని ఎడిటర్ ప్రశ్నించారు.