Andhra Family Treats Son-in-law With 379 Types Of Food Items On Makar Sankranti
mictv telugu

కొత్త అల్లుడికి 379 వంటకాలతో విందు భోజనం!

January 19, 2023

కొత్త అల్లుడు ఇంటికి వస్తే రుచికరమైన వంటకాలను వండి వడ్డించడం మామూలే. కానీ సంక్రాంతి పూట ఒక కుటుంబం కొత్త అల్లుడికి ఏకంగా 379వంటకాలతో విందు భోజనం వడ్డించారు.

భారతదేశంలో ఆహారం ప్రాముఖ్యత ఎక్కువ. ఇష్టపడిన వారికి వంట చేయడం, కొసరి కొసరి వడ్డించడం అనేది ప్రేమను వ్యక్తీకరించే మార్గం. సాంప్రదాయ విందు లేకుండా భారతీయ పండుగలు, దానితో పాటు వేడుకలు పూర్తి కావు.

మకర సంక్రాంతి వేడుకలు ఇటీవల దేశవ్యాప్తంగా జరిగాయి. అందరూ రుచికరమైన వంటకాలు చేసుకూనే ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక కుటుంబం ఈ వేడుకను జరుపుకోవడానికి చాలా శ్రమ పడింది. అవును.. భీమారావు, చంద్రలీల అనే ఏలూరు జిల్లా దంపతులు తమ కూతురు అల్లుడికి కోసం విలాసవంతమైన విందును ఇవ్వాలనుకున్నారు. దానికి సంక్రాంతి పండుగ సరైనదని అనుకున్నారు. అయితే ఎన్నిరకాలు వడ్డించాలని వాళ్లు భావించారో తెలుసా? మొత్తంగా 379 రకాల వంటకాలను కొత్త అల్లుడికి వడ్డించారు.
మురళీధర్.. ఆ ఇంటి కొత్త అల్లుడు. ఈ సందర్భాన్ని మొత్తం వీడియో తీసి ‘మొదటి సంక్రాంతి చాలా గొప్పగా జరిగింది. పశ్చిమ గోదావరి విందు భోజనం చేశాం. లంచ్ లో 379 ఐటమ్ లు ఉన్నాయి’ అంటూ క్యాప్షన్ రాసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. వెంటనే ఆ వీడియో వైరల్ అయింది. లైక్లు, కామెంట్లకు అయితే లెక్కేలేదు.
ఈ విందు భోజనంలో..

నలభై రకాల అన్నాలు, ఇరవై రకాల రోటీ చట్నీలు, నలభై రకాల కూరలు, నలభై రకాల ఫ్రైలు, తొంభై నుంచి వంద రకాల డెజర్ట్స్, డెబ్బై రకాల హాట్ ఐటమ్స్, జ్యూస్ లు, డ్రింక్స్ మరెన్నో ఈ విందులో ఉన్నాయని అతను పేర్కొన్నాడు. అయితే చంద్రలీల కుమార్తెతో నిశ్చితార్థం సందర్భంలో గోదావరి ప్రాంతం వంటలను గురించి అడిగాడు. దీంతో వారు అతనిని ఎంతగా ప్రేమిస్తారో చూపించాలనుకున్నారు. కాబట్టి ఈ విస్తారమైన భోజనాన్ని ఆశ్చర్యకరంగా ప్లాన్ చేశారు. వారు ఎనిమిది నెలల నుంచి ఈ వంటకా గురించి ప్లాన్ చేశారు. దాదాపు రెండు వారాల నుంచి అన్నిటినీ ఎలా దగ్గరకు చేయాలో చూసుకున్నారు. పండుగ పూట కొత్త అల్లుడికి ప్రేమతో వడ్డించారు.