కేసీఆర్ సభలో ఆంధ్రా అభిమానులు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సభలో ఆంధ్రా అభిమానులు

March 17, 2019

ఆంధ్ర నాయకులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నచ్చకపోవచ్చు గానీ అక్కడి ప్రజలకు కేసీఆర్ అన్నా, ఆయన వ్యూహాలన్నా నచ్చుతాయి. అందుకే ఆయనకు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానులు ఏర్పడ్డారు. కరీంనగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. కరీంనగర్‌లోని స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరుగుతోంది. 16 స్థానాలను సాధిద్దాం.. ఢిల్లీని శాసిద్దాం అనే నినాదంతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే

ఈ భారీ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత మంది కేసీఆర్ అభిమానులు వచ్చారు. కేసీఆర్ సభ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తున్నామని ఈ సందర్భంగా వారు వివరించారు. కేసీఆర్ అంటే తమకు ఎంతో అభిమానం ఉందనీ, ఇలాంటి నాయకుడు తమ రాష్ట్రానికి చాలా అవసరమని అన్నారు.

Andhra fans in the KCR Meeting.

విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన కొనిజేటి ఆదినారాయణ అనే అభిమాని మాట్లాడుతూ.. ‘కేసీఆర్ లాంటి నాయకుడు ఆంధ్రాకు ఎంతో అవసరం. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. ఆంధ్రా తెలంగాణ మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయనీ, కరెంటు విషయంలో చార్జీలు రావాల్సి ఉందనీ, పోలవరం ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో, పులిచింతల నిధుల కేటాయింపులో సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు.

ఆంధ్రా రాజకీయాల్లో కొందరు నాయకులు అభివృద్ధి చేయడం చేతకాక కేసీఆర్ వంటి మహానాయకుడిని బూచిగా చూపుతున్నారు. ఇది సిగ్గుచేటు. ఆంధ్రా వ్యక్తిని అయి ఉండి తెలంగాణలో కేసీఆర్ హాజరయ్యే ప్రతి సభకు హాజరవుతాను. ఇలాంటి నాయకుడిని నేనెక్కడా చూడలేదు. ఆంధ్రాలో అమలు చేస్తున్న పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నవే. ఇక్కడి పథకాలే అక్కడా కాపీ కొడుతున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు మాకూ కావాలి’ అని ఆదినారాయణ తెలిపారు.