కేసీఆర్‌పై ఆంధ్రా అభిమానం.. జన్మదిన శుభాకాంక్షలతో ఫ్లెక్సీ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌పై ఆంధ్రా అభిమానం.. జన్మదిన శుభాకాంక్షలతో ఫ్లెక్సీ

February 16, 2020

CM KCR

సోమవారం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయా ఏర్పట్లలో ఉన్నారు. ఈ జన్మదినంతో ఆయన 66వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తోన్న సిద్ధిపేట్ జిల్లాలోని గజ్వేల్‌లో రెండురోజుల కిందటే పుట్టినరోజు వేడుకలు ప్రారంభం అయ్యాయి.  గజ్వేల్‌కు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారు. వేలాది మొక్కలను నాటి.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

అలాగే 2600 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ ముఖాకృతిలో నిల్చుని, కనువిందు చేశారు. 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థానిక గ్రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలావుండగా ఏపీలోనూ ఆయన అభిమానులు పుట్టినరోజు సంబరాలు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అక్కడి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గతంలో కూడా కేసీఆర్ బీజేపీయేతర ఫ్రంట్ కోసం విశాఖకు వెళ్లినప్పుడు ఆయనకు ఆంధ్రా అభిమానులు ఘనస్వాగతం పలికారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. మహిళలు బతుకమ్మలతో కూడా స్వాగతం పలికారు. ఏపీలోని అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి శారదాపీఠం వెళ్లే రోడ్ మార్గం వరకు భారీ కటౌట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.