మంత్రుల మధ్య బాబు చిచ్చు... - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రుల మధ్య బాబు చిచ్చు…

June 15, 2017

విశాఖ భూ కుంభకోణంలో టీడీపీ ఇరుక్కుందా?: గంటా లేఖ వెనుక ఉన్నది చంద్రబాబేనా?.. ఏపీలో అసలేం జరుగుతోంది! మంత్రుల మధ్య లొల్లి పెట్టి భూ దందా అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారా..?బాబు మార్క్ డ్రామా ఫలించేనా…?

విశాఖ జిల్లాలో భూ దందాల పర్వం జోరుగా నడిచింది. ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. చినగదిలి రూరల్‌ మండలం పరిధిలో సుమారు రూ.2500 కోట్లు ప్రభుత్వ భూమి ఆక్రమణ అయినట్లు జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. దీంతో ఆ మండలంలో జరిగిన భూదందాలు, రి కార్డుల ట్యాంపరింగ్‌కు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక బృందాలతో జిల్లా కలెక్టర్‌ విచారణ జరిపించారు. భీమిలి తహసీల్దార్‌గా పనిచేసిన బి.టి.వి.రామారావు ఇష్టారాజ్యంగా రికార్డుల్లో మార్పులు చేశారు. పైగా సర్వేనెంబర్లు మార్పు చేసి తనకు అనుకూలమైన, లంచాలు సమర్పించిన వారికి పట్టాదారు పాసుపుస్త కాలు ఇచ్చారు. ఈ విషయం ఏసీబీ విచారణలో సైతం వెలుగు చూసింది.

ఈ భూదందాలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో పెద్దఎత్తున భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, దానికి తమ పార్టీకి చెందిన నాయకులు కారకులని పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి అయ్యనపాత్రుడు చెప్పడం రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపింది. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని మరో మంత్రి గంటా గట్టిగా ఖండించారు. ఇదే ఇప్పుడు టీడీపీని భూదందాలో ఇరికించేలా చేసింది. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల్ని ఉప్పు నిప్పులా చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖరాశారు. లేఖలో అయ్యన్నపాత్రుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఆ లేఖలో ఏముందంటే…సంక్షిప్తంగా…

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి!‘రాష్ట్ర విభజన తరువాత విశాఖపట్నం ఐటి రాజధానిగా, ఆర్థిక రాజధానిగా, స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడంలో మీ కృషి అభినందనీయం. ఇటువంటి సందర్భంలో మన విశాఖ జిల్లాకు చెందిన మంత్రివర్యులు అయ్యన్నపాత్రుడు, ఈ జిల్లాలో పెద్దఎత్తున భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, దానికి మన పార్టీకి చెందిన నాయకులు కారకులని పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం రాష్టవ్య్రాప్తంగా సంచలనమైన సంఘటన. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం వలన విశాఖ ప్రతిష్ఠ దిగజారడమే కాకుండా, దాని ప్రభావం మన పార్టీపై కూడా ఉంటుంది. గతంలో కూడా విశాఖ ఉత్సవ్, ల్యాండ్ పూలింగ్, చంద్రన్న సంక్రాంతి కానుకల విషయంపై ఇటువంటి నిరాధార ఆరోపణలు చేసి, మన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. ఇలాంటి సంఘటనల వలన ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ, పురంధ్రీశ్వరి, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు మన పార్టీపై ప్రతి రోజు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చి ప్రజల్లో అపనమ్మకం కలిగిస్తున్నారు. ఈ ఆరోపణలపై సిబిసిఐడి, సిబిఐతోగాని, సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపి, నిజానిజాలు రాష్ట్ర ప్రజలకు తెలియచేయాల్సిందిగా వినయపూర్వకంగా కోరుచున్నాను. ఇట్లు.. మీ విశ్వసనీయ.. గంటా శ్రీనివాసరావు’ అని చంద్రబాబుకు లేఖ రాశారు.

అంతే కాదు అయ్యన్నపాత్రుడి వల్ల పార్టీకి భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ఆయన ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తప్పదని హెచ్చరించారు.

ఇప్పుడు ఈ ఇద్దరు మధ్య లొల్లిని పుట్టించి చంద్రబాబు తనదైన మార్క్ లో కొత్త డ్రామాకు తెరతీశారు. భూ దందా అంశాన్ని తెర మీద లేకుండా చేయడానికి.. మంత్రుల మధ్య తగాదాకు బీజం వేశారన్న వాదనలున్నాయి. ఇందులో భాగంగానే మంత్రి గంటా శ్రీనివాసరావు …సీఎం చంద్రబాబు కు లేఖ రాసినట్లు చెబుతున్నారు.సరే ఎన్నాళ్లు ఈ మార్క్ డ్రామా నడిస్తుంది. అసలు భూ కుంభకోణం వేల కోట్లలో జరిగిందని తేలింది. అందులో ఎవరున్నరన్నది ప్రశ్న. ప్రజలకు కూడా ఇదే కావాలి. చూడాలి చంద్రబాబు ఏం చేస్తారో…ఈ భూ స్కాంలోని నేతల పేర్లు బయటపెడుతారా…ఇలానే మంత్రులతో డ్రామాలడించి వదిలేస్తారో…