కొంతమంది లంచావతారాల కారణంగా మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వచ్చేసింది. యాసిడ్ పోసి కడిగినా పోనంత మచ్చ పడిపోయింది. తోడుపుబండ్ల నుంచి షాపింగ్ మాల్స్ వరకు, గల్లీ బ్రోతల్ హౌస్ నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వ్యభిచారం వరకు ఎక్కడ పడితే అక్కడ గడ్డికరిచే పోలీసులు లీలల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమేలు. కొందరైతే శవాలను పీక్కుతినే రాబందులు కూడా సిగ్గుపడేలా లంచాలు దండుకుంటున్నారు. పోస్ట్మార్టం నివేదిక ఇవ్వాలంటే లంచం ఇచ్చి తీరాల్సిందే అంటూ అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఏఎస్ఐ ఒకడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖ ములగాడలో గత నెలాఖర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేష్ కుమార్ పట్నాయక్, అతని తండ్రి మురళీధర్ తీవ్రంగా గాయపడ్డారు. మురళీధర్ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తన తండ్రి పోస్ట్ మార్టం నివేదిక, ఎఫ్ఐఆర్ కాపీలను ఇవ్వాలని నరేశ్ గాజువాక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. రూ. 5 వేల లంచం ఇస్తేనే వాటిని ఇస్తానని ఏఎస్ఐ సూర్యనారాయణ డిమాండ్ చేశాడు. తండ్రిని కోల్పోయిన దు:ఖంలో ఉన్నామని, లంచం ఇచ్చుకోలేమని నరేష్ వాపోయినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు వలపన్ని లంచం పుచ్చుకుంటున్న సూర్యానారాయణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.