ఏపీలో అవినీతి తగ్గింది.. 5వ స్థానంలో తెలంగాణ   - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో అవినీతి తగ్గింది.. 5వ స్థానంలో తెలంగాణ  

November 29, 2019

Andhra Pradesh..........

లంచం ఇవ్వనిదే పని కావటం లేదనే అభిప్రాయం పలు రాష్ట్రాల్లో వ్యక్తం అయిందని ఓ సర్వే తేల్చింది. దీన్నిబట్టి మన దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి రాష్ట్రాల వారిగా ఏ రాష్ట్రంలో ఎంత అవినీతి ఉందో తెలుసుకుందాం. ఈ సర్వేలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో అవినీతిలో ఏపీ నాల్గవ స్థానంలో ఉండగా, ఈసారి అది 13వ స్థానానికి చేరింది. ఇక, తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో అవినీతిలో తొలి స్థానంలో, జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో ఉన్నట్లు సర్వే చెప్పింది. ఇండియన్ కరప్షన్ సర్వేలో ఏ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించారు. మొత్తం 28 రాష్ట్రాల్లో చేసిన ఈ సర్వే నివేదికలో తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

ఏపీలో జాతీయ సగటు రేటు కంటే అవినీతి తగ్గినట్లుగా వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ మాత్రమే జాతీయ స్థాయిలో సగటు అవినీతి రేటు కంటే తక్కువగా నమోదైంది. ఏపీలో 50 శాతం మంది ఇంకా లంచాలు ఇచ్చే తమ పనులు చేయించుకుంటున్నామని స్పష్టం చేశారు. అందులో 30 శాతం మంది అనేకసార్లు లంచాలు ఇచ్చామని చెప్పగా.. 20 శాతం మంది మాత్రం ఒకటి లేదా రెండుసార్లు ఇచ్చామని తెలిపారు. 30 శాతం మంది లంచాల జోలికి వెళ్లకుండానే సేవలు పొందుతున్నామని స్పష్టం చేశారు. 

ఏపీలో అవినీతి రేటింగ్ గతం కంటే తగ్గినా.. ప్రభుత్వ పరిధిలోని కీలక శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందని వెల్లడించారు. భూమికి సంబంధించి వ్యవహారాలు..రిజిస్ట్రేషన్ల పనుల కోసం 43 శాతం మంది లంచాలు ఇవ్వాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు మున్సిపల్ కార్పోరేషన్‌లో సేవల కోసం బెంచీ కింద చేతులు పెడితేనే పనులు జరుగుతున్నాయని మరో 21 శాతం మంది తేల్చి చెప్పినట్లు సర్వే చెప్పింది. పోలీసు శాఖలో 7 శాతం మంది లంచాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పగా.. రవాణా, పన్నులు, విద్యుత్ వంటి శాఖల్లో 29 శాతం మంది లంచాలు ఇస్తున్నట్లు సర్వే వెల్లడించింది.