Andhra Pradesh announces ban on plastic flexis
mictv telugu

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధం.. సీఎం జగన్ కీలక నిర్ణయం

August 26, 2022

ఇక నుండి ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఎక్కడైనా ఫ్లెక్సీలుు ఏర్పాటు చేయాలంటే బట్టతో చేసిన ఫ్లెక్సీలనే ఉపయోగించాలని ఆయన కోరారు. తిరుమలలో ప్లాస్టిక్ లేకుండా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. 2027 చివరి నాటికి ప్లాస్టిక్ లేని రాష్ట్రంగా మార్చుతామని సీఎం జగన్ ప్రకటించారు. శుకవారం నాడు సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికితీసేందుకు పార్లే ఓషన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.

పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అబివృద్దిని సాధించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. విశాఖ పట్టణంలో ప్రపంచంలోనే అతి పెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా సీఎం ప్రకటించారు. ఇవాళ 76 టన్నుల ప్లాస్టిక్ ను సముద్రం నుండి తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్ర జీవరాశులను నాశనం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పార్లే సంస్థ సముద్రం నుండి ప్లాస్టిక్ వ్యర్ధాలను బయటకు తీస్తుందన్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలను రీ సైకిల్ చేసి బూట్లు, గాడ్జెట్స్ వంటి వాటిని తయారు చేయనున్నట్టుగా జగన్ వివరించారు.

ఏపీ రాష్ట్ర పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకొనే బాధ్యత మనందరిపై ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్ధిక పురోగతి నాణెనికి రెండు వైపు కోణాలని జగన్ చెప్పారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుండే వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో 4097 చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు.