ఏపీకి ఎంతో ఇచ్చాం.. ఇంకా ఇస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీకి ఎంతో ఇచ్చాం.. ఇంకా ఇస్తాం

February 6, 2018

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆ రాష్ట్ర ఎంపీలు పార్టీలకు అతీతంగా పార్లమెంట్ లోపలా, బయటా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాన్ని ఘోరంగా విస్మరించారంటూ మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అవసరమైతే బీజేపీ తెగదెంపులు చేసుకుంటమని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. రాజ్యసభలో దీనిపై మంగళవారం ప్రకటన చేశారు.

కట్టుబడి ఉన్నాం..

విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని, ఏపీకి చాలా సంస్థలను మంజూరు చేశామని ఆయన చెప్పారు. ‘ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం. ఎన్నో చేశాం. కేంద్ర, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో నిధులను భరించాలి.  ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం  నిధులు కేంద్రం ఇస్తుంది. మేం ఇప్పటికే 60 శాతం ఇచ్చాం కనుక హోదా లేకున్నా మిగతా 30 శాతం నిధులను ప్రత్యేక ప్యాకేజీగా ఇస్తున్నాం. ఇతర ప్రత్యామ్నాయ  మార్గాలో డబ్బులు ఇచ్చేందుకు యత్నిస్తున్నాం. రెవెన్యూ లోటుకు సంబంధించి రూ. 3,900 కోట్లు ఇప్పటికే ఇచ్చేశాం… విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్ట్ నిధుల రూపంలో ఆ లోటును భర్తీ చేస్తాం’ అని తెలిపారు.

విశాఖ రైల్వోజోన్ ప్రతిపాదనపై

విశాఖ రైల్వే జోన్ హామీని తుంగలో తొక్కారన్న ఆరోపణలపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ.. ఆ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, ఇతర రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోపక్క.. ఏపీకి బడ్జెట్లో మొండిచెయ్యి చూపారని ఉభయసభలో టీడీపీ, కాంగ్రెస్, వైకాపా ఎంపీలు నిరసన తెలిపారు. వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.