మండలి రద్దుకు అసెంబ్లీ ఆమోదం.. ఖర్చు దండగన్న జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

మండలి రద్దుకు అసెంబ్లీ ఆమోదం.. ఖర్చు దండగన్న జగన్

January 27, 2020

assembly dissolves

రాజధాని తరలింపు బిల్లును అడ్డుకున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మళ్లీ కాలగర్భంలో కలిసిపోయింది. తన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి పునరుద్ధరించిన మండలిని సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో రద్దు చేయించారు. ఈ రోజు మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. జగన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై విస్తృత చర్చ జరిగింది. తర్వాత స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ఈ తీర్మానంపై ఓటింగ్ పెట్టారు. సభలోని 133 మంది సభ్యులూ లేచి నిలబడ్డంతో బిల్లు నెగ్గింది. సభకు టీడీపీ సభ్యులు హాజరుకాలేదు. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం, తర్వాత రాష్ట్రపతి సంతకం తర్వాత రద్దు అధికారికంగా అమల్లోకి వస్తుంది. 

చర్చలో సీఎం మాట్లాడుతూ. ‘ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీకే ప్రధాన్యం ఉంటుంది. మన రాజ్యాంగ నిర్మాతలు ఒకవేళ మండలి తప్పనిసరని అనుకుని ఉంటే దాన్ని రద్దు చేయడానికి వీల్లేకుండా నిబంధనలు తీసుకొచ్చి ఉండేవారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం మండలిని అసెంబ్లీ రద్దు చేయొచ్చు. ఆనాడు తక్కువగా ఉండిన విద్యావంతులకు అవకాశం కల్పించడానికి మండలిని తీసుకొచ్చారు. ఇప్పుడందరూ విద్యావంతులే. మన సభలో ముగ్గురు పీహెచ్ డీలు, 38 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజినీర్లు, 68 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు బిల్లులను అడ్డుకుంటే మండలితో పనేంటి? ఎలాంటి ఫలితాలు ఇవ్వకుండా కేవలం లాంఛనంగా మారిన మండలి మనకొద్దు. దీని కోసం ప్రభుత్వం ఏటా రూ. 60 కోట్లు ఖర్చుచేస్తోంది. ఇకపై ఇలా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం శుద్ధ దండగ’ అని మండిపడ్డారు.