విశాఖ వేదికగా ఏపీ సర్కార్ నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. రెండు రోజు పాటు సాగిన ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు, దేశ విదేశాల పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరయ్యారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 353 ఎంవోయూల ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులుకు సంబందించిన ఒప్పందాలు జరిగాయి.వీటి ద్వారా 6 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఒక రాష్ట్రం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు రావడం ఇటీవల కాలంలో ఇదే రికార్డు అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడంపై కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, శర్బానంద్ సోనోవాల్ తదితరులు ప్రశంశలు కురిపించారు. అదేవిధంగా ఏపీ సీఎం జగన్‌తో పాటు, కేంద్రమంత్రలు ఏపీ రాజధాని విశాఖ అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
ఏపీ గ్లోబల ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం కావడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సదస్సును విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు ప్రభుత్వం నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుందని తెలిపారు. 15 కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అభినందనీయమన్నారు. పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు త్వరగా ముందుకు రావాలని కోరారు. సదస్సు ద్వారా తనకు అంతులేని ఆత్మవిశ్వాసం దక్కిందన్నారు. అత్యంత కీలక సమయంలో ఈ సదస్సును నిర్వహించాం… వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడున్నర సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ శర వేగంతో పుంజుకుంటుందని జగన్ స్పష్టం చేశారు.
ఈ సమ్మిట్ ద్వారా ఏపీ ప్రభుత్వం పెట్టుబడులతో పాటు విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి మరోసారి తీసుకొచ్చింది. విశాఖయే రాజధాని అని జగన్ తన ప్రసంగంలో మాట్లాడారు. కిషన్ రెడ్డి వంటి కేంద్రమంత్రులు సైతం విశాఖ రాజధాని అంటూ మాట్లాడడం వైసీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.