చలో అసెంబ్లీ..అమరావతిలో హైటెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

చలో అసెంబ్లీ..అమరావతిలో హైటెన్షన్

January 20, 2020

bhgb

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. ఆ ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాదాపు నెల రోజులుగా రాజధాని రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో సోమవారం రోజున అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపిచ్చింది. దీంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. చలో అసెంబ్లీ నేపథ్యంలో ఆదివారం రోజున టీడీపీ నేతల ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించారు. టీడీపీ నేతలకు సెక్షన్ 149 కింద పోలీసులు నోటీసులు అందించినట్లుగా పోలీసులు తెలిపారు. ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు కూడా ఉంటాయని వెల్లడించారు.

సచివాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉద్యోగులు వెళ్లే గేట్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గుర్తింపు కార్డు పరిశీలించి, క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మందడం వెళ్లే మార్గంలో పోలీసులు వలలు సిద్ధం చేసి ఉంచారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. భారీ సంఖ్యలో పోలీసులతో పహారా కాస్తున్నారు.