వివేకాను దారుణంగా చంపేశారు.. చంద్రబాబు - MicTv.in - Telugu News
mictv telugu

వివేకాను దారుణంగా చంపేశారు.. చంద్రబాబు

March 17, 2019

మాజీ ఎంపీ వైస్ వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లోనే అతి దారుణంగా చంపేశారని ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయనగరంలోని అయోధ్య మైదానంలో నిర్వహించిన సభలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

‘జగన్ ముందు వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పాడు. వివేకా శరీరంపై అన్ని గాయాలుంటే గుండెపోటుతో ఎలా మరణించాడు. రక్తపు మడుగుల్లో వివేకా ఉంటే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇంట్లోని రక్తపు మరకలను ఎందుకు కడిగేశారు. ఆస్పత్రిలో వివేకా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి హత్యేనని నిర్ధారించిన తర్వాతనే జగన్ డ్రామాలు మొదలు పెట్టాడు. వివేకాను చంపింది తెలుగుదేశం పార్టీ వాళ్లేనని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. వివేకా కారు డ్రైవర్‌ను డ్యూటీకి తొందరగా రమ్మని చెప్పినందుకు చంపబోయాడని లేఖ రాసినట్లు చూపిస్తున్నారు’ అని బాబు అన్నారు. వైసీపీ తప్పుడు ఆలోచనలతోనే పుట్టుకొచ్చిందని, అందుకే దొంగలంతా ఆ పార్టీలోనే చేరుతున్నారని బాబు ఘాటుగా విమర్శించారు.