హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ బిజీ సమావేశాలతో గడపడడం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ఆయన రాష్ట్రానికి వచ్చాక గురువారం విజయవాడలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో భేటీ అయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని వైకాపా వర్గాలు చెప్తున్నాయి. జగన్ సీజేఐకి పుష్పగుచ్ఛంతోపాటు తిరుపతి వెంకన్న ప్రతిమ అందజేశారు. మూడు రోజుల తిరుపతి పర్యటన ముగించుకున్న సీజేఐ విజయవాడలో నోవాటెల్ హోటల్లో బసచేయగా సీఎం వెళ్లి కలిశారు. కాగా తిరుపతి పర్యటనలో చంద్రచూడ్‌కు ఘన స్వాగతం లభించింది. టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతించి ఆయా క్షేత్రాల గురించి వివరించారు. కాగా, ఢిల్లీ పర్యటనలో జగన్ మోదీ ముందు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను ఉంచారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారని, మోదీ అందుకు సానుకూలంగా స్పందించారని చెప్పారు.