తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సన్మానించారు. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సత్యం, ఆయన బృందానికి సీఎం వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికారు.
"వైయస్ఆర్ మత్స్యకార భరోసా" పథకాన్ని ప్రారంభిస్తూ.. #YSRMatsyakaraBharosa
Posted by YS Jagan Mohan Reddy on Wednesday, 20 November 2019
తరువాత సత్యానికి శాలువా కప్పి సన్మానించారు. బోటు వెలికి తీసినందుకు సీఎం అభినందించారు. సత్యం బృందాన్ని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం సన్మానించిన సంగతి తెలిసిందే. బోటు వెలికితీయడం కష్టం అని నిపుణులు నిర్ధారణకు వచ్చారు. నేవీ కూడా ప్రయత్నించి సాధ్యం కాక చేతులెత్తేసింది. అయితే ధర్మాడి సత్యం తన బృందం సభ్యులతో లంగర్లతో అన్వేషించి బోటును వెలికితీశారు. ఆయన సాహసాన్ని మెచ్చుకున్న ప్రభుత్వం ధర్మాడి సత్యం బృందానికి రూ.50 వేల రివార్డు, సభ్యులందరికీ ప్రశంసా పత్రాలు అందజేసింది. గత సెప్టెంబర్ 15న గోదావరి నదిలో పర్యాటకులతో వెళుతున్న వశిష్ట లాంచ్ మునిగిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో దదాపు 46మంది దుర్మరణం పాలయ్యారు.