Andhra Pradesh chief minister jagan strategy in selection R. krishnaiah for rajya sabha seat
mictv telugu

రాజ్యసభకు కృష్ణయ్య.. జగన్ వ్యూహం ఇదేనా?

May 17, 2022

Andhra Pradesh chief minister jagan strategy in selection R. krishnaiah for rajya sabha seat

తెలంగాణకు చెందిన బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్యను వైకాపా రాజ్యసభ అభ్యర్థిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణకే చెందిన సినీ నిర్మాణ నిరంజన్ రెడ్డిని కూడా ఎంపిక చేసినా, అది ‘కులం’తో కాకుండా ‘వేరే అంశాల’తో సంబంధించిన వ్యవహారం కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిందేమీ లేదు.
బీసీలను తమవైపుకు తిప్పుకోవడంలో భాగంగానే జగన్ కృష్ణయ్యను పెద్దల సభకు ఎంపిక చేశారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అదే నిజమైతే ఏపీలో బీసీ నాయకులు చాలా మందే ఉన్నారు కదా అనే ప్రశ్న రాకమానదు. ఏరి కోరి పొరుగు రాష్ట్రానికి చెందిన బీసీ నేతకు పట్టం కట్టడం వెనక జగన్ వ్యూహమేమిటో రాజకీయ పరిశీలకులకు కూడా అర్థం కావడం లేదు. కృష్ణయ్య గతంలో ఎల్బీనగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ వెనుక బీసీలు ఉన్నారని చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. ఏపీలో నిజానికి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి బీసీల్లో పట్టు ఉంది. టీడీపీలో చాలామంది బీసీ నేతలు మీడియా ప్రతినిధులుగా జగన్ సర్కారును దుమ్మెత్తిపోస్తుంటారు.
మరోపక్క వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలుచుకునే సీట్లపై అధికార పార్టీలోనే సందేహాలు ఉన్నాయి. తమకు కొన్ని సీట్లు తగ్గొచ్చని మంత్రి అంబటి రాంబాబు స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ వెనక ఉన్న బీసీలను ఆకర్షించడానికి జగన్ కృష్ణయ్యను పావుగా కదిపారని పరిశీలకులు భావిస్తున్నాయి. రాజ్యసభకు పంపదగ్గ బీసీ నేత వైకాపాలో మరొకరు లేరా అని సందేహమూ ఇక్కడ తలెత్తుంది. జగన్ అలాంటి ‘చిన్న విషయాలు’ పట్టించుకోరు. జగన్ మొండి మనిషి. మొండితనం కొన్ని విషయాల్లో లాభం కలిగిస్తుంది. కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతుంది. కృష్ణయ్య పావుతో జగన్ రచిస్తున్న వ్యూహం ఫలితం కాలమే చెబుతుంది.