సైకిల్ గెలుపుకు కారణం ఇదే... - MicTv.in - Telugu News
mictv telugu

సైకిల్ గెలుపుకు కారణం ఇదే…

September 2, 2017

నంద్యాల ఉప ఎన్నిక విజయం  ఆ తర్వాత కాకినాడ  నగర పాలక సంస్థ ఎన్నికల్లో  విజయం సాధించి మాంచి ఊపుమీదున్న టిడిపికి ముందు ముందు కూడా ఇట్లాగే ఉంటుందా? ఇది జగన్ వైఖరి  వల్ల టిడిపికి లాభించిందా? లేక పోతే జగన్ వ్యూహాత్మక తప్పిదం వల్లనే ఇట్లా జరిగింది. అదీ కాదంటే జగన్ కు ఇంకా రాజకీయ అనుభవం  రానందుకే  టిడిపి విజయాలను తన అకౌంట్లో వేసుకుంటున్నదా? ఇంతకూ  ఈ విజయాలు చంద్రబాబు పాలన తీరుకు మెచ్చే వచ్చాయా? రాబోయే సాధారణ ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయా? ఇవే సందేహాలు అంతటా వినవస్తున్నాయి.

నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ చేసింది వ్యూహాత్మక  తప్పిదం  అనే  అయన అభిమానులు అంటున్నారు.  ఆ తప్పిదమే అక్కడ  సైకిల్ కు బాగా లాభించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. భూమా  ఫ్యామీలిపై తమకు సానుభూతి ఉందని… ఎన్నికల బరిలో ఉండటం లేదని జగన్ చెప్పి ఉంటే తన ఇమేజీ మరింత పెరిగేదని టాక్ బలంగా ఉంది.  ఒక వేళ పోటీకి దిగినా అన్ని  రోజులు అక్కడ ప్రచారం చేయకుండా ఉండాల్సిందనే చర్చా ఉంది. డబ్బులు పంచారనే పరస్పర విమర్శలూ ఎట్లాగూ ఉన్నాయి.

కాకినాడ పరక ఎన్నికల్లో జగన్ తప్పిదం కంటే అధికార పార్టీ అనే భావనే   అక్కడ టిడిపిని గెలిచేలా చేసింది. అయితే జగన్  నిలబెట్టిన అభ్యర్థులు… వారి పూర్వచరిత్ర కూడా కొంత స్టడీ చేస్తే బావుండేదనే అభిప్రాయమూ ఉంది. జగన్ ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు. పైగా తన ఇమేజీ  తగ్గుతున్నదనే ఆందోళన ఆయన అభిమానుల్లో ఉంది. ప్రస్తుతానికైతే టిడిపికి బాగా లాభిస్తున్నది.

జగన్  తన ప్రచారంలో మాంచి ఊపు ఉంటున్నది. కానీ  సభలకు వచ్చిన జనాలు ఓట్లు వేయడం లేదు.  స్పందన బాగా ఉంటున్నది కానీ బాక్స్ లో ఓట్లు పడటం లేదు. ఎందుకూ అంటే సింపుల్ లాజిక్… జగన్ బాబు తీరు మారాలనేదే ఆన్సర్.  ఆయన అంటే చాలా మందికి  అభిమానం ఉంది. మాట్లాడే మాట తీరు…. సబ్జెక్టు పై అధ్యయనం చేసి… కొద్ది మాటల్లోనే నిర్దిష్ట అర్థం  చెప్పాలి… అదీ లౌక్యంగా చెప్పాలని చాలా మంది ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఎదుటి వాళ్లు చెప్పే సూచనలు, సలహాలు కొన్నిసార్లు అయినా వింటే ఇంకా బావుంటుందనే టాక్ కూడా బాగా విన్పిస్తున్నది.

అయితే వచ్చే  సాధారణ ఎన్నికల్లో ఈ ఫలితాలు ఎట్లి పరిస్థితుల్లో పునరావృతం  కావనే అభిప్రాయం మాత్రం బలంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి గెల్చింది కానీ 2019 ఎన్నికల నాటికి పరిస్థితులు మారుతాయి…. బాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం  సాధ్యం అయ్యే పని కాదు. పైగా ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఆయనకే మంచిదనే అభిప్రాయం జనాల్లో ఉంది.

నంద్యాల్లో వైసీపీ గెల్చినా  పెద్దగా ప్రయోజనం ఉండదు. కాకినాడ పురపాలకలో  పాగా వేసినా ఫలితం ఉండదు. ఎందుకంటే పైన ఉన్నది బాబు ప్రభుత్వం. వచ్చే ఎన్నికల నాటికి సీన్ మారటం ఖాయమని అంటున్నారు జగన్  అభిమానులు.  జగన్ ఇటీవల ప్రకటించిన పథకాలు జనాల్లోకి బలంగా తీసుకెళ్తే గనుక  తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. వాటిని ఎట్లా తీసుకెళ్తారో…  జనాలకు ఎట్లా నమ్మకం కలిగిస్తారనేదే కీలకం. దాంట్లో జగన్ సక్సెస్ అయితే ఈ అపజయాలే ఆయన విజయానికి సోపానాలు   అవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.