నా మతంపై మాట్లాడుతుంటే బాధగా ఉంది..జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

నా మతంపై మాట్లాడుతుంటే బాధగా ఉంది..జగన్

December 2, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు గుంటూరులోని జీజీహెచ్‌లో ‘వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత ప్రసంగిస్తూ ఇటీవలి కాలంలో కొందరు తన మతం, కులం గురించి మాట్లాడుతూ, దారుణమైన విమర్శలు చేస్తున్నారని, వాటిని వింటుంటే బాధగా ఉంటోందని వ్యాఖ్యానించారు. “నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. నా మతం మానవత్వం అని ఈ వేదికపై నుంచి చెప్పదలచుకున్నా. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని ఈ వేదికపై నుంచి చెప్పదలచుకున్నా. ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలని పనిచేస్తున్నా” అని జగన్ అన్నారు. 

Andhra pradesh cm.

వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా శస్త్రచికిత్స చేయించుకున్న బాధితులకు ఆర్థిక సాయం అందుతుందని జగన్ తెలిపారు. శస్త్రచికిత్సల తర్వాత లబ్ధిదారులకు రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల ఆర్థికసాయం చేస్తామన్నారు. డిశ్చార్జి అయిన 48 గంటల్లోపు రోగి బ్యాంకు ఖాతాకు సాయం మొత్తాన్ని జమ చేయనున్నారు. సొమ్ము అందకపోతే టోల్‌ ఫ్రీ నంబర్‌ 104కి ఫోన్‌ చేయాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమం అమలు సందర్భంగా లబ్దిదారులకు సీఎం జగన్‌ చెక్కులు అందజేశారు. జనవరి 1 నుంచి అర్హులందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు అందించనున్నట్లు సీఎం చెప్పారు. ‘ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు పెంచాం. మొత్తం 2వేల వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా జనవరి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు చేపడుతున్నాం. తర్వాత దశలవారీగా 2వేల వ్యాధులకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం వర్తింపజేస్తాం. రూ.వెయ్యి ఖర్చు దాటితే పథకం వర్తించేలా చర్యలు చేపడుతున్నాం.’ అని సీఎం జగన్‌ అన్నారు.