జగన్ పెద్ద మనసు..దారి ఖర్చులకు డబ్బు ఇవ్వాలని ఆదేశం
వలస కూలీలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్ద మనసు చాటుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన వలస కూలీలను స్వరాష్ట్రానికి తీసుకుని రావాడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ఏపీలో ఉన్న పలు రాష్ట్రాలకు చెందిన వలసకూలీలను వారి స్వరాష్ట్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వలస కూలీలకు దారి ఖర్చుల కోసం రూ.500 ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..'రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేసి వారికి భోజనం, తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి. తమ రాష్ట్రాలకు వెళ్తామంటే ప్రయాణ ఏర్పాట్లు చేయండి. వలస కూలీల ప్రయాణానికి అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వెళ్లేటప్పుడు దారి ఖర్చుల కింద ఒక్కో కూలీకి రూ.500 ఇవ్వండి. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారి ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. అలాగే విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారికి కూడా క్వారంటైన్ సదుపాయాలపై దృష్టి పెట్టాలి' అని అధికారులకు ఆదేశించారు.
ఈరోజు కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ కృష్ణబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.