Andhra Pradesh cm jangan mohan Reddy slams janasena chief pawan kalyan
mictv telugu

వీధిరౌడీలు కూడా అలా మాట్లాడరు.. పవన్‌కు జగన్ కౌంటర్

October 20, 2022

‘కొడకల్లారా, చెప్పు తీసి కొడతా..’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి భగ్గుమన్నారు. చెప్పులు చూపించడం చెత్త రాజకీయమని, నాయకులు ప్రజలకు ఇచ్చేది ఇలాంటి సందేశమేనా అని అన్నారు. ‘‘వీధి రౌడీలు కూడా అలా మాట్లాడరు. చేసేది చెప్పుకోలేక బండబూతులు తిడుతున్నారు. మూడు పెళ్లిళ్ల వల్ల మేలు జరుగుతుందని, అందరూ అలాగే చేసుకోవాలని అంటున్నారు. మూడునాలుగేళ్లు కాపురం చేసి డబ్బులిచ్చి వదిలేసి మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు. ఇలాగైతే మనింట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి?’ అని ఎద్దేవా చేశారు. తాను దత్తపుత్రులను నమ్ముకోలేదని, మీడియాను నమ్ముకోలేదని అన్నారు. గురువారం అవనిగడ్డలో భూమి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘ఇది మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది సామాజిక న్యాయానికి, సామాజిక విచ్ఛిన్న శక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ కుట్రలు రాబోయే రోజుల్లో మరిన్ని జరుగుతాయి. వీటిని ప్రజలు నమ్మొద్దు. పేపర్లు, టీవీ చూడొద్దు. మీ ఇంటికి మేలు జరిగిందని అనుకుంటే నావైపు నిలబడండి’ అన్నారు. తనది ప్రజల ప్రభుత్వమని, ఒక్క జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి ఇంతమంది ఏకమవుతున్నారని అన్నారు. విపక్షాలు పొత్తులను, కుట్రలను, దత్తపుత్రులను నమ్ముకోలేదని, తాను దేవుణ్ని, అక్కచెల్లెళ్లను నమ్ముకున్నానని అన్నారు.