ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు గాని ఆంధప్రదేశ్‌కు చెందిన ఓ దినకూలి రాత్రికి రాత్రి పేద్ద కంపెనీ పెట్టేశాడట. బాగా సంపాదించేశాడట. ఎంతగా అంటే జీఎస్టీ కట్టాల్సినంత స్థాయిలో! అధికారులు ఊరుకుంటారా, పన్ను కట్టవోయ్ అని నోటీసు పంపారు!! ఒకసారి కాదు, రెండుసార్లు.. ఏమిటి నిజమా, కలా? ఏమిటీ తికమక అని అని కంగారుపడకండి. ఇదంతా జీఎస్టీ పన్ను అధికారులు లీల. కానీ, నోటీసు అందుకున్న రెక్కడాడితే డొక్కాలని కూలి మాత్రం భయం భయంతో జీవిస్తున్నాడు. పన్ను అధికారులు ఎప్పుడు తనను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారేమోనని అల్లాడిపోతున్నాడు.
ఢిల్లీలో ఉందట..
ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పనపాడుకు చెందిన మదనపు మోహనకృష్ణ అవినాశ్ దినకూలి. ఓ పక్క ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తూ మరోపక్క కష్టం చేసుకుని బతుకుతున్నాడు. అతని తండ్రి లారీ డ్రైవర్. బొటాబొటి జీవితాలు. కానీ ఢిల్లీ నుంచి అవినాశ్‌కు గత ఏడాది డిసెంబర్ నెలలో జీఎస్టీ నోటీసులు వచ్చాయి. ఏదో పొరపాటున వచ్చాయని, తనకు ఏ కంపెనీ లేదు కదాని అని పట్టించుకోలేదు. అయితే ఈ నెల 13న మళ్లీ నోటీసులు వచ్చాయి.
‘‘మీరు ఢిల్లీలో జయ శ్రీకృష్ణ ఎంటర్‌ఫ్రైజస్ కంపెనీ పెట్టారు. 2022 మార్చి నుంచి సెస్టెంబరు వరకు భారీగా వ్యాపారం చేశారు. ఈ లావాదేవీలపై జీఎస్టీ చెల్లించాలి. లేకపోతే చర్యలు తీసుకుంటాం’’ అని వాటిలో ఉంది. దీంతో విషయం సీరియస్సేనని అవినాశ్ కంగారుపడిపోయాడు. ఏం చేయాలో తెలియక రాజమండ్రిలోని ఆదాయపన్ను శాఖ అధికారులను సంప్రదించాడు. మోసగాళ్లు అవినాశ్ వ్యక్తిగత వివరాలు చోరీ చేసి దుర్వినియోగం చేసి ఉండొచ్చనని, ఆ కంపెనీ వివరాలు తెలుసుకుంటామని అధికారులు అతణ్ని ఊరడించి పంపారు.