ఏపీలో రెండో డీఎస్సీ.. 12,370 పోస్టులు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో రెండో డీఎస్సీ.. 12,370 పోస్టులు

December 6, 2017

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం వెలువరించారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

‘45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుంది.  మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. వచ్చే విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్‌ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తాం’ అని వివరించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు.

మార్చి 23,24,26 తేదీల్లో జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు సిద్ధం కావాలని సూచించారు. హాల్‌ టిక్కెట్లును వచ్చే ఏడాది మార్చి 9 వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ, లాంగ్వేజ్‌ పండింట్‌ ఉద్యోగాలు 10,313తో పాటు తొలి దశలో మోడల్‌ పాఠశాలల్లో 1197 ఉద్యోగాలు, ప్రత్యేక అవసరాలు కల్గిన విద్యార్థుల కోసం మరో 860 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటించడం ఇది రెండోసారి.

* డీఎస్సీ నోటిఫికేషన్‌ – డిసెంబర్‌ 15న
* దరఖాస్తుల స్వీకరణ: డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
* హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు చివరి తేదీ: మార్చి 9
* రాత పరీక్షలు : మార్చి 23,24,26
* రాత పరీక్ష కీ విడుదల : ఏప్రిల్‌ 9న
* కీపై అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్‌ 10 నుంచి 16 వరకు
* తుది కీ విడుదల తేదీ: ఏప్రిల్‌ 30
* మెరిట్‌ లిస్ట్‌ ప్రకటన : మే 5
* ప్రొవిజనల్‌ సెలక్షన్‌ విడుదల చేసి అభ్యర్థులకు సమాచారం: మే 11న
* ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన: మే 14 నుంచి 19 వరకు