ఆత్మహత్యా? గుండెపోటా? పోస్ట్ మార్టం తర్వాతే..డీసీపీ
టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆకస్మిక మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. కోడెలది ఆత్మహత్యా? లేదా హత్యా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై హైదరాబాద్ డీసీపీ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. కోడెలది ఆత్మహత్యా? లేదా హత్యా? అనేది పోస్టుమార్టం తర్వాత నిర్ధారిస్తామని వెల్లడించారు.
కోడెల కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. కోడెల ఉదయం 10 గంటలకు భార్యతో కలిసి టిఫిన్ చేశారు. 10.10 గంటలకు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత కోడెల డోర్ లాక్ చేసినట్టు గుర్తించిన ఆయన భార్య తలుపులు తెరవాలంటూ పిలిచారు. కోడెల ఎంత సేపటికీ తలుపు తెరవకపోవడంతో గన్ మెన్ సహాయంతో డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్న కోడెలను 10.40 గంటలకు కారులో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కోడెల చనిపోయినట్లు నిర్ధరించారు. 11 గంటల తర్వాత ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లుగా కేసు నమోదు చేసుకుని.. ఆయన గదిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని వెల్లడించారు. ఇదిలా ఉంటే కోడెల పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ ఇది హత్యా? లేదా? ఆత్మహత్య? అని చెప్పలేమని డీసీపీ అన్నారు.