భూవివాదం విధ్వంసానికి దారి తీసింది. తన భూమిలో అక్రమంగా చెక్ డ్యామ్ కట్టారన్న కోపంతో ఓ రైతు ప్రతాపం చూపించాడు. చెక్ డ్యామ్‌ను జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చేశాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా దోర్నాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నల్లవాగుపై ప్రభుత్వం నిర్మించిన డ్యామ్‌ను మల్లికార్జున అనే యువ రైతు పేల్చేశాడు. అధికారులు తన భూమిలో అక్రమంగా దాన్ని నిర్మించాడని అతడు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నాడు. పేల్చివేత తర్వాత అతడు ఊరు విడిచి పారిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 10 లక్షల వ్యయంతో ఈ చెక్ డ్యామ్ నిర్మించింది. అయితే ప్రభుత్వ భూమిలోనే డ్యామ్‌ను నిర్మించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.