జగన్ సంచలనం.. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై వేటు - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ సంచలనం.. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై వేటు

September 18, 2019

Andhra pradesh..

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలను సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సచివాలయంలో వైద్యఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో 100కు పైగా సిఫార్సులతో సుజాతరావు కమిటీ రూపొందించిన నివేదికలోని అంశాలను సీఎం జగన్‌కు వివరించారు. సుజాతరావు కమిటీ సిఫారసులపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన ప్రభుత్వం వీటిని యథాతధంగా ఆమోదించింది. 

జగన్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించింది. అలాగే వైద్యుల జీతాలు పెంచాల్సిందిగా సూచించిన సుజాతరావు కమిటీ ప్రతిపాదనకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ అమల్లోకి రానుంది. రెండు వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తెస్తూ, పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. మిగిలిన 12 జిల్లాల్లో 1200 వ్యాధులను కొత్తగా చేర్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకునేవారికి ఇకపై ఆరోగ్యశ్రీని వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తారు. ఆపరేషన్ చేయించుకున్న వారు కోలుకునేంత వరకు, విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేల చొప్పున, ధీర్ఘకాలిక వ్యాధుల వారికి నెలకు రూ.5 వేలు ఇవ్వాలని సీఎం సూచించారు. అలాగే రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని జగన్ కోరారు. కొత్తగా వైద్యుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.