దేవాలయ పదవుల్లో 50% రిజర్వేషన్లు.. జగన్ నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

దేవాలయ పదవుల్లో 50% రిజర్వేషన్లు.. జగన్ నిర్ణయం

September 13, 2019

Andhra pradesh government.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేవాలయ పాలక మండళ్లు, ట్రస్టు బోర్డుల్లోనూ సాధారణ పోస్టుల భర్తీ తరహాలోనే రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రభుత్వ నామినేట్ చేసే దేవాలయాల పాలక మండళ్లల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. పాలకమండళ్లలో మహిళలకు 50 శాతం పదవులను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఇక తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికస్తే.. టీటీడీ పాలకమండలి సభ్యులను 29 పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. గతంలో పాలకమండలిలో 19 మంది సభ్యులుగా ఉండేవారు. నూతన సభ్యులు రేపు ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. టీటీడీ బోర్డు పదవుల్లోనూ రిజర్వేన్లను అమలు చేస్తారనే చర్చ మొదలైంది. గతంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాత్రం ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్ల అంశం టీటీడీకి వర్తించదని స్పష్టం చేసారు. ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేయటంతో రిజర్వేషన్లు అమలు చేయటానికేనా అనే ఆసక్తి కర చర్చ సాగుతోంది. అదే సమయంలో ఇతర దేవాలయాల పాలక మండళ్లు.. ట్రస్టుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అమలు అవుతాయని అధికారులు స్పష్టంగా చేస్తున్నారు.