3,795 వీఆర్వో పోస్టుల భర్తీ.. మార్గదర్శాకాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

3,795 వీఆర్వో పోస్టుల భర్తీ.. మార్గదర్శాకాలు ఇవే..

June 6, 2020

 రెవెన్యూ శాఖలో వీఆర్వో పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 3,795 వీఆర్వో (గ్రామ రెవెన్యూ అధికారుల) గ్రేడ్‌ -2 పోస్టుల భర్తీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్వో (గ్రేడ్‌-2) పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) లుగా పనిచేస్తున్న అర్హులకు వన్‌టైమ్‌ ప్రాతిపదికన వీఆర్వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్ల నుంచి విజ్ఞప్తులు అందాయి. 

దీంతో వాటిన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఐదు నెలల కిందటే ఓ నిర్ణయం తీసుకుంది. 3,795 వీఆర్వో పోస్టులను ఇంటర్మీడియెట్‌ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్‌ఏలతో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జిల్లా కలెక్టర్లు ఫైలును పక్కన పెట్టారు. దీంతో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మరోసారి విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతల్లో కొన్ని సడలింపులు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సీనియారిటీ ప్రాతిపదికన తక్షణమే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించి అర్హులైన వీఆర్‌ఏలను వీఆర్‌వోలుగా ఎంపిక చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

మార్గదర్శకాలు ఇలా…

-ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

-ఇంటర్మీడియట్‌ చదవకుండా నేరుగా డిగ్రీ, పీజీ చేసినవారు కూడా అర్హులే.

-ఈ ఏడాది జనవరి 1,2020 నాటికి వీఆర్‌ఏలుగా ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసి ఉండాలి.

-ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా కోర్సు పూర్తి చేసి ఉంటే ఆ సర్టిఫికెట్లు సరైనవో కావో కలెక్టర్లు ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి.

-అర్హులైన వీఆర్‌ఏలను వీఆర్‌వోలుగా ఎంపిక చేసేందుకు వన్‌టైమ్‌ ప్రాతిపదికన అనుమతించింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలను ఒకే పర్యాయానికి అనే షరతుతో మినహాయింపు ఇచ్చింది.