ముగ్గురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష… ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

May 7, 2022

కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జైలు శిక్ష విధించింది. శిక్ష పడిన వారు ప్రస్తుతం ఆ రాష్ట్ర ఉన్నత పదవుల్లో ఉండటం గమనార్హం. శిక్ష పడిన వారిలో ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, వీరపాండ్యన్, అరుణ్ కుమార్‌లు ఉన్నారు. వీరి ముగ్గురికీ నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కర్నూలు జిల్లాలో వీఏవో నియామకం విషయంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ కేసులో ధర్మాసనం తీర్పు అమల్లో ఐఏఎస్ అధికారులు నిర్లక్ష్యం వహించినందుకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. అయితే ఐఏఎస్ అధికారులు వీరపాండ్యన్‌, అరుణ్‌ కుమార్ విజ్ఞప్తితో జైలుశిక్ష అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేసింది. అయితే విచారణ సమయంలో పూనం మాలకొండయ్య హాజరుకాకపోవడంతో తీర్పు అమలును నిలుపుదల చేయడానికి న్యాయమూర్తి నిరాకరించారు. న్యాయస్థానాలు ఎవరి కోసమూ ఎదురు చూడవని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నెల 13లోపు హైకోర్టు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌) ముందు సరెండర్‌ కావాలని ఆమెను ఆదేశించారు.