వేల కిలోమీటర్ల పాదయాత్ర, రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవోకు ఎదురుదెబ్బ తగిలింది. రోడ్లపై సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1ని రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నెల 23 వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుంది. ఈ జోవీ ప్రజాస్వామ్యానికి, చట్టాలకు వ్యతిరేకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేసిన పిటిషన్ను హైకోర్టు గురువారం విచారించింది. ప్రజల స్వేచ్ఛను హరించే ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. దీనిపై స్పందనేమిటో తెలపాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఇటీవల చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి కొందరు చనిపోయి, కొందరు గాయపడిన నేపథ్యంలో జగన్ సర్కారు ఈ జీవో తెచ్చింది. అయితే ఈ ఘటనల అనుకోకుండా జరిగాయని, పోలీసుల నిర్లక్ష్యమే కారణమని టీడీపీ అంటోంది. గతంలో జగన్ సభల్లోనూ ఇలాంటి విషాదాలు జరిగాయని, ఆ సాకుతో హక్కులను హరించడం సరికాదని అంటోంది. టీడీపీపై పగతో ప్రభుత్వం అన్ని పార్టీలపై అణచివేతకు దిగుతోందనే విమర్శలు ఉన్నాయి.