ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవతరణ దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. 2014, జూన్ 2న రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జూన్ 2న ఏపీకి జరిగిన నష్టానికి నిరసనగా.. నవనిర్మాణ దీక్ష చేపట్టేవారు. ప్రతియేటా నిర్వహించిన ఈ దీక్ష జూన్ 2న ప్రారంభమై.. 8వ తేదిన మహాసంకల్ప దీక్షగా చేసి ముగించేవారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల్లో అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించింది. వేడుకల నిర్వహణకు సంబంధించి తొమ్మిది మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా 1956, నవంబర్ 1న తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.