అమరావతిపై నిపుణులతో జగన్ కమిటీ - MicTv.in - Telugu News
mictv telugu

అమరావతిపై నిపుణులతో జగన్ కమిటీ

September 13, 2019

jagan ..

ఇటీవల అమరావతిలో వరదలు వచ్చినప్పుడు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవుతుందని, వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదం ఉందని అన్నారు.  ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టించాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి ప్రకాశం జిల్లాలోని దొనకొండకు తరలించాలనే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్లో కూడా గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఓ కమిటీని నియమించింది. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ప్రొఫెసర్ మహావీర్, శివానందస్వామి, అంజలీ మోహన్, డాక్టర్ అరుణాచలం, కేటీ రవీంద్రన్ సభ్యులుగా ఉంటారు. వీరంతా పట్టణాభివృద్ధి రంగంలో నిపుణులే. ఈ కమిటీ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధికి పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వనుంది. ఈ కమిటీ ఆరు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. పర్యావరణం, వరదల నియంత్రణలో నిపుణులైన వారిని కమిటీలో కో ఆప్షన్ సభ్యులుగా నియమించుకోవచ్చని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.