3 రాజధానులు మరో ఏడాది ఆలస్యం.. శాసనమండలి రద్దు ఈజీ కాదు! - MicTv.in - Telugu News
mictv telugu

3 రాజధానులు మరో ఏడాది ఆలస్యం.. శాసనమండలి రద్దు ఈజీ కాదు!

January 21, 2020

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదానికి శాసనమండలి మోకాలడ్డింది. టీడీపీకి మెజారిటీ ఉన్న మండలిని ఏకంగా రద్దు చేస్తే పోలా అంటున్నారు వైకాపా నేతలు. కాసేపట్లో సీఎం జగన్ దీనిపై నిర్ణయం తీసుకుని, వీలైతే రేపే అసెంబ్లీలో తీర్మానం పెడతారని వార్తలు వస్తున్నాయి. తీర్మానం ఆమోదించగానే పని పూర్తయిపోయిన మూడు రాజధానులు వచ్చేస్తాయని అధికార పక్షనేతలు అంటున్నారు. 

కానీ ఈ ప్రక్రియ అంత త్వరగా సాగేది కాదని మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. రద్దు కావాలంటే ఏడాది పడుతుందని అంటున్నారు. దీంతో ఈ వివాదం కాస్తా పార్లమెంటుకు చేరే అవకాశముంది. ఏ రాష్ట్రంలోనైనా శాసన మండలిని ఏర్పాటు చేయాలన్నా, ఉన్నదాన్ని రద్దు చేయాలన్నాపార్లమెంటు ఉభయ సభల ఆమోదం తప్పనిసరిగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వం మండలిని రద్దుచేయడం, తర్వాత కాంగ్రెస్ తిరిగి తీసుకురావడం ఆ ప్రక్రియ ద్వారానే జరిగింది. 

జగన్ ప్రభుత్వం తక్షణ కర్తవ్యవంగా మండలిని అసెంబ్లీలో తీర్మానం ద్వారా రద్దు చేసినా.. అధికారికంగా రద్దు కావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. పార్లమెంటు వెంటనే ఈ అంశాన్ని చేపట్టే అవకాశం కనిపించడం లేదు. త్వరలో జరిగి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం దీన్ని ప్రాధాన్య అంశంగా పరిగణించదు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై దేశవ్యాప్తంగా నిరసనలు మరికొన్ని నెలల పాటు సాగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే వర్షాకాల సమావేశాల్లోనూ మండలి రద్దు లోక్‌సభ గడప తొక్కలేదు. బీజేపీ కూడా ఏపీలో తన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మండలిపై నిర్ణయం తీసుకుంటుంది. బీజేపీ, జనసేన పొత్తు కూడా తోడవడంతో సమీకరణాలపై తర్జనభర్జనలు సాగుతాయి. అంతవరకు మండలి ఉనిలోకి ఉంటుంది. ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇంకో ఏడాదిన్నర గడిస్తేగాని మండలిలో వైకాపాకు మెజారిటీ రాదు. జగన్ అంతవరకు వేచి చూస్తారా? లేకపోతే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి త్వరంగా రద్దు తతంగం ముగిస్తారా అన్నది తేలాలంటే వేచిచూడాల్సిందే.