ఆంధ్రప్రదేశ్ రాజధానుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. మూడు ప్రాంతాలకు సమాన న్యాయం చేయడానికే మూడు రాజధానులు పెడుతున్నామని సాక్షాత్తూ సీఎం జగన్ చెప్పగా, అదంతా అవాస్తమని ఆర్థిక మంత్రి బుగ్గున రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఏదో దాచిపెడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుగ్గన మాటల ప్రకారం.. ఏపీకి అసలైన, ఒకే ఒక రాజధాని విశాఖపట్నమే అని భావించాల్సి ఉంటుంది. విశాఖలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగుళూరులో ఏపీ సర్కారు జరిపిన రోడ్ షోలోబుగ్గన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్వెస్టర్లు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మూడు రాజధానులన్న విషయం అవాస్తవమని అన్నారు.
సింగిల్ కేపిటల్
‘’ఏపీ పరిపాలన మొత్తం విశాఖ నుంచే జరుగుతుంది. కర్నూలు న్యాయ రాజధాని కాదు. అక్కడ హైకోర్టు మాత్రమే ఉంటుంది. వైజాగ్‌లో ఐటీ పరిశ్రమల కోసం ఐటీ పార్కులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మంచి వాతావరణం, పోర్టులు, పరిశ్రమలు ఉన్నాయి కాబట్టే అదే రాజధానిగా నిర్ణయించాం. గుంటూరులో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. తిరుపతి ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధాని.’’ అని బుగ్గన అన్నారు. తన మాటల్లో ఎక్కడా అమరావతి అనే మాట కూడా రాకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. ఈ వ్యాఖ్యలతో ఏపీకి ఒకటే రాజధాని అని తేల్చిచెప్పినట్లయింది.
ఏపీకి వాస్తవ రాజధాని అమరావతి మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటు సాక్షిగా ప్రకటిండం తెలిసిందే. అయితే రాజధానిని రెండు నెల్లో విశాఖకు మారుస్తున్నామని జగన్ చెబుతున్నారు. ప్రజలను గందరగోళపరచడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాయని విశ్లేషకుల అంచనా. వచ్చే ఎన్నికల వరకు ఇలాంటి దోబూచులాట సాగుతుందని, ఎన్నికల నాటి పరిస్థితిని బట్టి, గెలుపోటములను బట్టి ఆ తర్వాత కొత్త నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు.