కేంద్రం మద్యం అమ్మకాలపై సడలింపు ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ప్రస్తుతం ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతోంది. జగన్ ప్రభుత్వం మద్యం అమ్మకలకు అనుమతి ఇవ్వడాన్ని ప్రతిపక్షం టీడీపీ పార్టీ తప్పుపడుతోంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ‘అమ్మ ఒడి పథకం డబ్బులు నాన్న గొంతు తడి పధకం కోసం ఖర్చు అయ్యిపోతున్నాయి అని అమ్మలు వాపోతున్నారు జగనన్నా’ అంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు.
ఈ సెటైర్లపై ఏపీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు..’కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఏపీలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడే టీడీపీ కార్యకర్తలకు వంద రూపాయలు ఇచ్చి వైన్ షాపుల వద్ద క్యూలైన్లలోకి పంపుతున్నారు.
వారికీ మాస్కులు పెట్టుకోవద్దని చెపుతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మద్యం షాపులను తీయమని చెప్పింది మోదీ అయితే… సీఎం జగన్ ను చంద్రబాబు విమర్శిస్తున్నారు.’ అని నాని మండిపడ్డారు.