రూ.20కే ఇంటి పట్టా..పావలా రుణాలు కూడా - MicTv.in - Telugu News
mictv telugu

రూ.20కే ఇంటి పట్టా..పావలా రుణాలు కూడా

December 3, 2019

ఏపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ‘పేదలందరికీ ఇళ్లు పథకం’ కింద 25 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇంటి స్థలాలను ఐదేళ్ల తరువాత అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఇంటి స్థలాలు అమ్మే సమయంలో సబ్ రిజిస్ట్రార్లకు ఎలాంటి నిరభ్యంతర ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనికి అనుగుణంగా ఇంటి పట్టాను ఉచితంగా కాకుండా రాయితీపై ఇస్తున్నామని వెల్లడించింది. లబ్ధిదారుడు ఇంటి స్థలానికి రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.10 స్టాంపు పేపరు, మిగిలిన రూ.10 పట్టా ల్యామినేషన్‌కు ఖర్చు పెట్టనున్నారు. ప్రభుత్వం అందజేసే ఇంటి పట్టా ఆధారంగా బ్యాంకుల నుంచి పావలా పైసా వడ్డీతో రుణాలు పొందవచ్చని రెవెన్యూశాఖ కార్యదర్శి ఉషారాణి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

housing.

పేదలందరికీ ఇళ్లు పథకం లబ్దిదారులు రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకూ ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వం ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తుంది. ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని ఆడవారి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 1.5 సెంట్ల ఇంటిస్థలం ఇచ్చి.. పైసా ఖర్చులేకుండా పక్క ఇల్లు పొందేలా చేస్తారు. 2020 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభమై, ఉగాది నాటికి ఇళ్లస్థలాలు, పట్టాల పంపిణీ కార్యక్రమం అన్ని జిల్లాలో పూర్తవుతుంది. ఈ పథకం కోసం 2019-20 బడ్టెలో రూ.8615 కోట్లు కేటాయించారు.