దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్ హౌస్ అరెస్టు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసీని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్తుండగా పోలీసులు ఆయనను అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసేవారిని హౌస్ అరెస్టు చేయడం దారుణమని, పోలీసులను అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. చాలా మంది టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇసుక సమస్యపై ఏలూరులో ధర్నా చేసేందుకు చింతమనేని సమాయత్తమయ్యారు. దీంతో ధర్నాకు వెళ్లకుండా పోలీసులు ఆయన్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు.