తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు తెగిపోయాయి. దాదాపు రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నతాధికారుల సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు రోజులుగా ఏపీలో కురుస్తున్న వర్షాలవల్ల ఇప్పటివరకు 10 మంది మృతిచెందినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎక్స్గ్రేషియా ఎంత అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నది.