ఏపీలో ఒంటిపూట బడి.. కొత్త షెడ్యూల్ ఇదీ..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఒంటిపూట బడి.. కొత్త షెడ్యూల్ ఇదీ.. 

October 29, 2020

Andhra Pradesh school reopening schedule

దేశంలో కరోనా కేసులు ‘తగ్గుముఖం’ పడుతున్న నేపథ్యంలో దేశ్యాప్తంగా స్కూళ్లను తెరుచుకోడానికి కేంద్రం అనుమతివ్వడం తెలిసిందే. నవంబర్ 2 నుంచి స్కూళ్లను తెరుస్తామని చాలా రోజుల కిందటే ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఈ రోజు షెడ్యూలు విడుదల చేసింది. రోజు మార్చి రోజు తరగతులతోపాటు ఒంటి పూట బడిని కూడా అమల్లోకి తీసుకొస్తోంది. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా సోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. 

షెడ్యూలు ఇలా..

తొమ్మిది, పది, ఇంటర్‌ విద్యార్థులకు  రోజు విడిచి రోజు ఒక్క పూట తరగతులు ఉంటాయి. నవంబర్‌ 2 నుంచి వీటిని నిర్వహిస్తారు. నవంబర్‌ 23 నుంచి ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులు ప్రారంభమవుతాయి. ఒకటి నుంచి ఐదో తరగతులకు క్లా డిసెంబర్‌ 14 నుంచి తరగతులు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు  ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా ఇదే షెడ్యూలు వర్తిస్తుంది. ఏడు నెలల తర్వాత స్కూళ్లు తెరుచుకోనుండడంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. పిల్లలకు కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఇళ్లలో ఉండి తలనొప్పిగా తయారయ్యారని చదువుకోకపోతే భవిష్యత్తు ఉండదని కొందరు అంటున్నారు. మాస్కులు, శానిటైజర్లు వాడుతూ చదువుకోవాల్సిందేనని అంటున్నారు.