ప్రత్యేక హోదా అంటే ఏంటి? ఏపీకి అది దక్కుతుందా? - MicTv.in - Telugu News
mictv telugu

ప్రత్యేక హోదా అంటే ఏంటి? ఏపీకి అది దక్కుతుందా?

February 13, 2018

విభజనతో రాజధానిని కోల్పోయి, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి పార్టీలు క్రియాశీలం అయ్యాయి. మోదీ మోసం చేశారని, ప్యాకేజీతో సరిపెట్టారని సాగుతున్న విమర్శలు పార్లమెంటు సాక్షిగా తీవ్రమై చివరికి రాజీనామా చేస్తామనే ప్రకటనల దాకా వెళ్తున్నాయి.

విభజన సమయంలో తాత్కాలిక ఆవేశకావేశాలను చల్లార్చడానికో, లేకపోతే చిత్తశుద్ధితోనే తెలియదుగాని..  ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన యూపీఏ సర్కారు ఇప్పుడు లేదు. ఆ హోదా(వచ్చి ఉంటే) మరో ఐదేళ్లు కొనసాగిస్తామని చెప్పిన బీజేపీ.. తర్వాత మాట మార్చి ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకోమని చెబుతోంది.

ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది?

పేరులోనే ఉన్నట్లు ఈ హోదా వస్తే ఇతర రాష్ట్రాలకు అందని ప్రత్యేక ఆర్థికంగా చేయూత లభిస్తుంది. వివిధ ప్రాజెక్టుల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య నిష్పత్తుల్లో కేంద్ర వాటా పెరుగుతుంది. కేంద్ర నిధులు 90 శాంతం గ్రాంట్లు గాను, 10 శాతం అప్పుగాను వస్తాయి. గ్రాంట్లను తిరిగి చెల్లించనక్కర్లేదు. పరిశ్రమలకు భారీగా రాయితీలు, 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు వస్తుంది.

పరిశ్రమలు పెరుగుతాయి. రాష్ట్ర బడ్జెట్ లోటును కేంద్రం తీరుస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోకపోతే వెనక్కి వెళ్లవు. మళ్లీ వాడుకోవచ్చు. రాజధాని నిర్మాణానికి కేంద్ర నిధులు అందుతాయి. ఇలాంటి మరెన్నో ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనాలు కలుగుతాయి. ప్రజలకు ఉపాధి లభిస్తుంది.  ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖండ్‌లో 2వేలు, హిమాచల్ ప్రదేశ్‌లో 10వేల పరిశ్రమలు వచ్చాయని చెబుతున్నారు.

ఇప్పుడు ఎన్నిరాష్ట్రాలకు ఉంది?

ప్రస్తుతం దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అవి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ,  మిజోరాం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర,  సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్. వీటిలో చాలావరకు చిన్నరాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాలచ్ వంటికి ఇప్పటికే కాస్త వనరులు ఉన్న రాష్ట్రాలు.

హోదాకు అర్హతలేంటి?

  1. కొండ ప్రాంతాలు, నైసర్గికంగా ఇతరత్రా క్లిష్టమైన భూభాగాలు
  2. తక్కువ జనసాంద్రత లేదా అధిక గిరిజన జనాభా
  3. పొరుగు దేశాలతో సరిహద్దు ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలు
  4. ఆర్థిక, మౌలిక సదుపాయాలలో వెనుకబాటుతనం
  5. స్థిరంగా లేని రాష్ట్ర ఆర్థిక వనరులు… తక్కువనరులు, తక్కువ తలసరి ఆదాయం వగైరా

ఒక రాష్ర్టానికి ప్రత్యేక హోదా రావాలంటే, ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్రమంత్రులు, అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయం తీసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌కు ఈ అర్హతలు ఉన్నాయా?

అసలు లేవనే అంటోంది కేంద్రం. ఏపీలోని కొండప్రాంతాలు ఉన్నా చాలా తక్కువ. గిరిజన జనాభాకూ తక్కువే. అలాంటి ప్రాంతాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. హోదా ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని కొండప్రాంతాలు లెక్కలోకి రావు. మరో అర్హతయిన తక్కువ జనసాంద్రత కూడా ఏపీలో లేదు. ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత చదరపు కి.మీకి 17 మంది కాగా, ఏపీ జనసాంద్రత 308 మంది.

మరో అర్హత.. పొరుగు దేశాలతో సరిహద్దు ఉన్న వ్యూహాత్మక ప్రాంతం. ఏపీకి ఏ పొరుగుదేశంతోనూ సరిహద్దులేదు. ఆర్థిక మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం విషయానికి వస్తే కోస్తా ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. రాయలసీయ వెనుకబడినా అదొక ప్రత్యేక రాష్ట్రం కాదు కనుక.. మొత్తంగా ఏపీని పరిగణనలోకి తీసుకుని.. రాష్ట్రంలో సగటున పారిశ్రామికాభివృద్ధి జరిగిందన్నది కేంద్రం వాదన. ఆర్థిక వనరులు కూడా బాగానే ఉన్నాయని, కొత్త రాష్ట్రంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కాలక్రమంలో సర్దుకుంటాయని కేంద్రం చెబుతోంది. దీనికి ఉదాహరణగా ఛత్తీస్ గఢ్, జార్ఖండ్‌లను పేర్కొంటోంది. అయితే కొత్త రాష్ట్రమైన ఉత్తారాఖండ్‌కు హోదా ఇచ్చారు కదా అని ప్రశ్నిస్తే అది కొండప్రాంతం అని వాదిస్తోంది. పైగా ఇక నుంచి ఏపీ సహా ఏ రాష్ర్టానికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదని, అంతగా అయితే ఆర్థిక సాయం చేయాలని 14వ ఆర్థిక సంఘం చెప్పడం విశేషం. కేంద్రం ఈ వాదననే ముందుకు తెస్తోంది.

కనుక కేంద్రం విధించిన ప్రమాణాల ప్రకారం ప్రత్యేక హోదాకు కావలసిన అర్హతలు ఏపీకి లేనట్టే. ఆర్థిక వనరుల కొరత సమస్యకు ప్యాకేజీ మంత్రం పరిష్కారంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశ కూడా దీనిపైనే ఉంది. అయితే హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని పార్టీలు అంటున్నాయి.

లాబీయింగ్‌తో సాధ్యమేనా?

ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ర్టాల్లో కొన్నింటికి లాబీయింగ్ ద్వారానే అది దక్కిందనే ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచీ తదితర అంశాల్లో ఏపీకంటే ముందంజలో ఉన్నాయి. అయినా వాటికి ప్రత్యేక హోదా దక్కింది. తక్కువ ఉన్న ఏపీకి మొండిచేయి చూపిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను పక్కనబెడితే ఏపీకి హోదా ఇవ్వడం మోదీ సర్కారుకు చిటికెలో పని.

హోదా ఇస్తే పరిణామాలు ఎలా ఉంటాయి?

తేనెతుట్టెను కదిలించినట్లు ఉంటాయి. ఏపీకి ఇచ్చినప్పుడు తమకూ ఇవ్వాలని బిహార్, జార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయి. కేవలం ఉత్తరాదికే పరిమితమైన ఈ హోదా దక్షిణాదిలో ఒక రాష్ట్రానికి దక్కితే నాలుగు మూలల్లోని రాష్ట్రాలూ కదం తొక్కుతాయి. ఈ హోదా వల్ల కేంద్రానికి దక్కాల్సిన ఆదాయం తగ్గుతుంది కనుక ఆ ప్రభావం మళ్లీ అన్ని రాష్ట్రాలపైనా పడుతుంది.

రాజీనామాలు, ఉద్యమాలు ఫలిస్తాయా?

మోదీ సర్కారు మెజారిటీకి ఢోకా లేని నేపథ్యంలో టీడీపీ బెదిరింపులను తేలిగ్గానే తీసుకుంటారు. వైకాపా, కాంగ్రెస్ వంటి పార్టీ ఎంపీల రాజీనామాలతో ఏ ప్రమాదమూ ఉండదు కనుక హోదా అంశం ఎప్పటిలాగే నానుతూ ఉంటుంది…!

మరి చేయాల్సిందేమిటి?

కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తూ అందినకాడికి నిధులు రాబట్టుకోవడం తప్పిస్తే ఏపీ చేతిలో ప్రస్తుతానికి ఏమీ లేదు. పార్టీలు ఏకమై పార్లమెంటును స్తంభింపజేస్తే ఫలితం ఎలా ఉంటుందో చూసిందే. సభలు వాయిదా పడతాయి. అరుణ్ జైట్లీ, ప్రధాని.. చెప్పిన సోదే మళ్లీ మళ్లీ చెబుతారు. టీడీపీ ఇప్పటికిప్పుడు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోదు. వైకాపా ఎంపీలు రాజీనామా చేసినా ఫలితం ఉండదు. సీబీఐ కేసుల భయం ఎలాగూ ఉంటుందా పార్టీకి. పవన్ జేఏసీ అయినా మరొకటైనా.. రోడ్లపైకి వచ్చి ఉద్యమించి, పాలనను స్తంభింపజేస్తే.. ఆ దెబ్బకు కేంద్రం దిగొచ్చి మహా అయితే  మరికొన్ని ప్రాజెక్టులు, రాయితీలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే పోరాటం కేవలం రాజకీయ మనుగడ, వ్యూహాల కోసం కాకుండా చిత్తశుద్ధితో కొనసాగితేనే ఆ మాత్రం ఫలితాలైనా వస్తాయి. లేకపోతే ఎప్పటికీ మొండిచెయ్యే..!