పవన్.. ఏపీ నేల విడిచి సాము చేయకు! - MicTv.in - Telugu News
mictv telugu

పవన్.. ఏపీ నేల విడిచి సాము చేయకు!

February 16, 2018

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు ‘ప్రత్యేక హోదా’కు మించిన పాపులిస్టు రాజకీయం మరొకటి లేదు. అయితే ఆదిలోనే హంసపాదులు పడుతున్నాయి. హోదా ఉద్యమం దశ దిశ దారితప్పుతున్నట్లు కనిపిస్తోంది.

ఏపీకి జరిగిన అన్యాయాన్ని విశ్లేషించి నిగ్గుదేల్చేందుకు జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్(జేఎఫ్‌సీ) తొలి సమావేశం తీరు విమర్శలకు దారి తీసింది. సమావేశంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీతో అమీతుమీ తేల్చుకోవాలని కొందరు, సామరస్యంగా వెళ్లాలని కొందరు చెబుతున్నారు.

 

భేటీ జరపాల్సింది హైదరాబాద్‌లోనా? విజయవాడలోనా?

జేఎఫ్‌సీ తొలి భేటీ హైదరాబాద్‌లోని స్టార్ హోటల్ దస్‌పల్లాలో జరుగుతోంది. ఏపీ పీకల్లోతు కష్టాల్లో ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రజల సమస్యలను వివరించడానికి సమావేశాన్ని పక్క రాష్ట్ర రాజధాని పెట్టడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఈ సమావేశాన్ని నిర్వహించి ఉంటే సమంజసంగా ఉండేందని అభిప్రాయపడుతున్నారు.

ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడే చర్చించి, తీర్మానాలు వగైరా చేసి ఉంటే కేంద్రానికి గట్టి సంకేతం ఇచ్చినట్లు ఉండేదని, హైదరాబాద్‌లో జరపడం వల్ల కేంద్ర నాయకులు తేలిగ్గా తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు. రాజకీయ నాయకులకు ఇంకా హైదరాబాద్ పై మమకారం తగ్గలేదని, వారు కేవలం ఉబుసుకోక ఇలాంటి భేటీని పెట్టారని దురభిప్రాయం కలగకుండా తర్వాత జేఎఫ్‌సీ భేటీలలైన ఏపీలో పెట్టాలని సూచిస్తున్నారు. కాగా తొలి సమావేశానికి ఉండవల్లి, పద్మనాభయ్య, కొణతాల, చలసాని శ్రీనివాస్, సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు, గౌతమ్ తదితరులు హాజరయ్యారు.

టీడీపీ, వైకాపాలను పిలిచినా రాలేదు.. పవన్

ఈ భేటీకి టీడీపీ, వైసీపీలను ఆహ్వానించినా రాలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. ‘వారు వారి పంథాలో పోరాడుతున్నారు. అయినా మాకు సమస్యలేదు. జేఎఫ్‌సీతో కలిసి పనిచేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు.. ఇలాంటి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాం. భేటీల ముగిశాక సబ్‌కమిటీలు ప్రకటిస్తాం..’ అని  తెలిపారు. భేటికి వైకాపా నేతలు రాలేదని పవన్ చెప్పినప్పటికీ ఆ పార్టీ నేత తోట చంద్రశేఖర్ రావడం గమనార్హం. ఆయన పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగతంగా వచ్చినట్టు తెలుస్తోంది.