టీడీపీకి షాకిచ్చిన ముగ్గురు ఎమ్మెల్సీలు.. - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీకి షాకిచ్చిన ముగ్గురు ఎమ్మెల్సీలు..

January 22, 2020

dfg

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల బిల్లులపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు శాసన మండలిలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. మండలిలో వైసీపీ తగిన సంఖ్యా బలం లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో ప్రతిపక్ష టీడీపీ మండలిలో రూల్ 71 కింద చర్చకు నోటీసు ఇచ్చి వైసీపీని ఇరకాటంలో పడేసింది. మండలి చైర్మన్ షరీఫ్ రూల్ 71పై చర్చకు అనుమతించారు. 

సభలో దీనిపై చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో టీడీపీ పైచేయి సాధించింది. అయితే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రం షాకిచ్చారు. ఓటింగ్‌లో టీడీపీకి అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 13 ఓట్లు వచ్చాయి. 9 మంది తటస్థంగా ఉన్నారు. వీరిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాగిరెడ్డి వైసీపీ అనుకూలంగా ఓటేశారు. మరో ఎమ్మెల్సీ శత్రుచర్ల ఓటింగ్ సమయానికి మండలి నుంచి బయటకు వెళ్లిపోయారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా టీడీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెల్సిందే. మంగళవారం ఉదయం డొక్కా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారు. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. అలాగే మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు రత్నాబాయి, శమంతకమణి కూడా మండలికి హాజరుకాలేదు. కీలకమైన బిల్లులు మండలికి వస్తాయని టీడీపీ విప్ జారీ చేసినా ఎమ్మెల్సీలు మాత్రం పార్టీకి షాక్‌లు ఇచ్చారు.