విశాఖపట్నానికి చెందిన మాజీ ఉపాధ్యాయురాలు రాగులు, బియ్యం పిండితో తినే కప్పులను తయారు చేస్తుంది. నేడు ఆమె నెలకు 30 నుంచి 40వేల కప్పులను తయారు చేసి లాభాలు గడిస్తున్నది.
తినదగిన కప్పులో చాయ్ లేదా కాఫీ తాగాలనే ఆలోచన బాగుంది కదా! తినదగిన కప్పులు కొత్త కానప్పటికీ, ప్లాస్టిక్ ముప్పును అరికట్టడంలో సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఉత్పత్తుల్లో ఇది కచ్చితంగా ఒకటి. అయితే అవన్నీ ఆరోగ్యకరంగా లేవని భావించింది విశాఖపట్నంకు చెందిన టి. జయలక్ష్మి. తినదగిన కప్పులను ఆమె విశాఖపట్నంలోని రేసపువాని పాలెంలో ఒక చిన్నయూనిట్ ప్రారంభించింది. ఉపాధ్యాయురాలిగా పని చేసే జయలక్ష్మి ఇప్పుడు తినదగిన కప్పులకు రాగులు, బియ్యం పిండి ప్రధాన పదార్థాలుగా ఉపయోగిస్తున్నది.
అసలేమైంది..
తినదగిన కప్పుల తయారీ వ్యాపారం ప్రారంభించే ముందు జయలక్ష్మి ఒక ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పని చేసింది. ఆమె భర్త శ్రీనివాసరావు ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్ గా పని చేస్తుండేవాడు. 2020లో ఆయనకు కాలేయ సంబంధిత వ్యాధితో అస్వస్థకు గురయ్యాడు. ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ లో ఉండాలన్నారు. దీంతో జయలక్ష్మి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కోవిడ్ -19 ప్రపంచాన్ని చుట్టేసింది. ఆ సమయం కుటుంబానికి అత్యంత కష్టతరమైన సమయాల్లో ఒకటి.
మొదలుపెట్టిందిలా..
అనారోగ్యం, కోవిడ్ కారణాల వల్ల ఇద్దరూ పనులు చేయలేదు. ఇల్లు గడవడమే కష్టంగా మారింది. దీంతో జయలక్ష్మి ఏదైనా వ్యాపారం చేయాలని చాలా ఆలోచించింది. అప్పుడే రోజూ తాగే టీ, కాఫీలపైనా తన ఆలోచనలు ఆగాయి. వెంటనే టీ కప్పులు తయారు చేయాలని అనుకుంది. ప్లాస్టిక్, పేపర్, మట్టి కప్పులు.. ఇలా చాలా ఆలోచనలు, చివరకు తినే కప్పుల దగ్గర తన ఆలోచన ఆగింది. అప్పటికే ఉన్న బ్రాండ్ కు చెందిన ఫ్రాంచైజీని తీసుకోవాలని అనుకుంది. కానీ అది మంచి ఆలోచన కాదనిపించింది. తన స్వంత ఉత్పత్తిని తీసుకురావాలని భావించింది. అలా రాగులు, బియ్యం పిండి కప్పులు తయారు చేయాలని నిర్ణయించుకుంది. బెంగళూరు, హైదరాబాద్ నుంచి మెషినరీ కొనుగోలు చేసి ఫిబ్రవరి 2021లో తయారీ యూనిట్ ప్రారంభించింది.
వివిధ రకాలుగా..
టీ కప్పులు కేవలం రాగి, బియ్యం పిండితో పాటు.. చాక్లెట్, స్ట్రాబెర్రీ, వెనీలా, ఇలాయిచీ వంటి విభిన్న రుచుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రుచులు టీ, కాఫీల్లోకి చొప్పించబడుతాయి. ఈ కప్పులు 60 మి.లీ, 80మి.లీ. పరిమాణాల్లో వస్తాయి. ఒక్కో కప్పు ధర కూడా 2.5 నుంచి 3.5 రూపాయల వరకు పడుతుంది. ఈ టీ కప్పులు 20 నిమిషాల వరకు టీ, కాఫీలను వేడిగా ఉంచగలదు. ప్రస్తుతం 3 వేల నుంచి 4 వేల కప్పులను తయారుచేస్తుంది. సంవత్సరానికి 7 నుంచి 10 లక్షల వరకు సంపాదించగలగుతున్నది. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆమెకు ఆర్డర్లు అందుతున్నాయి.
ప్రత్యేకంగా ఉండాలని..
‘మా ఆయన మంచంలో ఉండడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఏదో ఒకటి చేసి ఇల్లు గడువాలని అనుకున్నా. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. కప్ ల కోసం సరైన ఫార్ములాను గుర్తించడానికి నాకు రెండు నెలలు పట్టింది. పదార్థాలు ఆరోగ్యంగా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నా. ఇప్పటివరకు టీ కప్పులు చేస్తున్నా. త్వరలో చాట్ బౌల్స్, క్రీమ్ బౌల్స్ లాంటి ఇతర ఉత్పత్తులను తయారు చేయాలని, వ్యాపారం మరింత పెంచాలని భావిస్తున్నా’ అంటున్నది జయలక్ష్మి.