తప్పుదిద్దుకున్న ఆంధ్రజ్యోతి.. జర్నలిజం విలువలకు గౌరవం! - MicTv.in - Telugu News
mictv telugu

తప్పుదిద్దుకున్న ఆంధ్రజ్యోతి.. జర్నలిజం విలువలకు గౌరవం!

March 10, 2018

జర్నలిజం అంటే హడావుడిగా రాసే చరిత్ర అనే నానుడి ఉంది. పని ఒత్తిడి, కచ్చితమైన సమాచారం అందుబాటులో లేకపోవడం, జర్నలిస్టుల వ్యక్తిగత అభిప్రాయాలు చొరబడడం, జర్నలిస్టులు కూడా మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఉందని భ్రమపడ్డం.. వంటి మరెన్నో కారణాలు వార్తల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తాయిం. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు.. త్వరలో 40 మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వచ్చిన వార్త కూడా అలాంటింది. ఇది సోషల్ మీడిలో విస్తృతంగా రావడంతో ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి కూడా ఒక కథనాన్ని ముద్రించింది.ఆంధ్రజ్యోతి కరీం నగర్ టాబ్లాయిడ్‌లో ఈ వార్త వచ్చింది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలతో పోలిస్తే ప్రింట్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలకు కొంతమేరకైనా నమ్మకం ఉంటుంది. అదికూడా ప్రముఖ పత్రికలో రావడంతో దీనిపై చర్చ జరిగింది. అయితే హరీశ్ విలేకర్ల సమావేశంలో ఈ వార్తలను గట్టిగా తోసిపుచ్చడంతో అబద్ధమని తేలిపోయింది. ‘ఇలాంటి పిచ్చిరాతలు రాస్తే జైలుకు పంపాలి..కఠిన చర్యలు తీసుకోవాలి’ అని హరీశ్ హెచ్చరించడంతో ఆంధ్రజ్యోతి తప్పు సవరించుకుంది.

శనివారం తన ప్రధాన సంచికలో సవరణ వేసింది. ‘సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక నిరాధార, అవాస్తవిక ప్రచారం ఆధారంగా టీఆర్ఎస్ నేత హరీశ్ రావు బీజేపీలో చేరతారని, 40 దాకా ఎమ్మెల్యేలు కూడా ఆయనకు అండగా ఉన్నారని పేర్కొంటూ శుక్రవారం నాడు కరీంనగర్ ఆంధ్రజ్యోతి టాబ్లాయిడ్ లో కలకలం పేరుతో ఒక కథనం రావడం జరిగింది. ఈ కథనానికి ఎలాంటి హేతుబద్ధతగాని, ప్రాతిపదికగాని లేదు. పొరపాటుకు చింతిస్తున్నాం.. ఎడిటర్’ అని రాసింది. ఈ సవరణ జర్నలిజం విలువలను గౌరవించేలా ఉందని పాత్రికేయులు అంటున్నారు.