ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ చెడుగుడులో చెలరేగిపోయారు. గ్రామీణ యువకులతో కలసి కబడి కబడి అంటూ కూతపెడుతూ బరి దాటి టార్గెట్ ఛేదించారు. తెలంగాణ పల్లెల్లో క్రీడాప్రాంగణాలను ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలపై క్రాంతికిరణ్ కొన్ని ప్లే గ్రౌండ్స్‌ను జడ్పీ చైర్ పర్సన్ మంజూశ్రీ జైపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. పుల్కల్ మండలంలోని మంతురు, సింగూర్, బస్వాపూర్ గ్రామాల్లో వీటిని ప్రారంభించారు. తర్వాత యువకులతో, స్థానికులతో కలసి సరదాగా కబడీ ఆడారు. ఫుట్ బాల్ కూడా ఆడి సందడి చేశారు. ప్రతి పల్లెలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికి తీయొచ్చుని ఆయన అన్నారు. ఆటలు వ్యాయామంగా పనికొస్తాయని, ఉల్లాసంగా ఉంటామని అన్నారు. ప్రతి గ్రామంలో ఒక ఎకరం స్థలంలో 4 లక్షల రూపాయల వ్యయంతో క్రీడాప్రాంగణాలను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు.